రియల్ఎస్టేట్ వ్యాపారం అంటే మోసం చేయడం అని గట్టిగా నమ్మేవారు చేస్తున్న మోసాలకు సామాన్యులు బలైపోతున్నారు. సొంత ఇల్లు లేదా స్థలం ఉండాలనుకుని ఆశపడే మధ్యతరగతి ప్రజల్ని రకరకాల స్కీములతో నిండా ముంచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వినూత్నమైన రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ఈ మోసంలో ప్రజల నుంచి ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది.
కొన్నాళ్ల కిందట కూకట్ పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అనే కంపెనీని కొంత మంది ప్రారంభించారు. తమ కంపెనీలో 8 లక్షలు పెట్టుబడి పెట్టి రెండు కుంటల స్థలం కొనుగోలు చేస్తే 25 నెలల పాటు నెలకు రూ.32 వేలు చెల్లిస్తామని ప్రచారం చేశారు. అలాగే ఏజెంట్లను పెట్టుకున్నారు. ఈ స్కీమ్‌లో ఎవరినైనా చేర్పిస్తే 25 నెలల పాటు నెలకు రూ.7200 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపారు. తర్వాత రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 12 నెలల తర్వాత రూ.8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్ ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. మాయగాళ్ళ మాటలు నమ్మి 3600 మంది పెట్టుబడి పెట్టారు. మొత్తం మూడువందల కోట్లు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేశారు.
ఎవరికీ స్థలాలు ఇవ్వలేదు. కట్టిన డబ్బులు తిరిగివ్వలేదు. ఏజెంట్లకు కమిషన్లు కొంత కాలం ఇచ్చారు. వారు అందరితో డబ్బులు కట్టించి నిండా మునిగిపోయారు. తమను మోసం చేశారని బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు పెట్టిన పోలీసులు సంస్థ ఎండీ కలిదిండి పవన్‌కుమార్ సహా 8 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మరికొంత మంది పరారీలో ఉన్నారు. అయితే వారు మహా అయితే నెల రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తారు. కేసు పెట్టారు కాబట్టి కోర్టులోనే తేల్చుకుందామంటారు. అంటే.. ఆ మూడువందల కోట్లు బాధితులకు రానట్లే. కేసులు పెట్టి అరెస్టులు చేయడం కాకుండా డబ్బులు రికవరీ చేయాలన్న డిమాండ్లు బాధితుల నుంచి వస్తున్నాయి. అది ఎప్పటికి జరుగుతుందో ఎవరికీ తెలియదు.
అందుకే కష్టపడి సంపాదించిన సొమ్మును అప్పనంగా డబుల్ చేస్తామని చెప్పేవారి మాటల్ని అసలు నమ్మకూడదు. భూముల పేరుతో.. స్థలాల పేరుతో.. ఇళ్ల పేరుతో చేసే మోసాల్ని కాస్త తెలివిగా ఆలోచిస్తే ఇట్టే కనిపెట్టవచ్చు.