శుక్రవారం అంటేనే సినీ అభిమానులకు పండగ. ఈ శుక్రవారం కూడా జోరుగా సినిమాలొస్తున్నాయి. యువ హీరోలు విశ్వక్సేన్ (మెకానిక్ రాఖీ), సత్యదేవ్ (జిబ్రా), అశోక్ గల్లా (దేవకీ నందన వాసుదేవ) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విడుదలకు ముందు ఈ సినిమాలపై కాస్తో, కూస్తో బజ్ క్రియేట్ అయ్యింది. దాన్ని ఈ సినిమాలు ఎంత వరకూ క్యాష్ చేసుకొంటాయన్నది ఆసక్తికరం. దాంతో పాటుగా ఈ ముగ్గురు హీరోలకూ… ఈ చిత్ర ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి.
యువ హీరోల్లో తనకంటూ ఓ మార్కెట్, శైలి సృష్టించుకొన్నాడు విశ్వక్సేన్. తన సినిమాలు గప్ చుప్‌గా ప్రారంభమైనా, చివరికి వచ్చేసరికి ఏదో రకంగా మార్కెట్ లో బజ్ క్రియేట్ చేసుకొంటాయి. సినిమాలో విషయం ఉన్నా లేకున్నా, తన స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలతో ప్రీ రిలీజ్ లో ఊపు తెచ్చే స్టామినా విశ్వక్‌కి ఉంది. ఈమధ్య తనకు కొన్ని ఫ్లాపులు తగిలాయి. ముఖ్యంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా నిరుత్సాహ పరిచింది. ఈ సినిమాపై విశ్వక్ చాలా నమ్మకంగా ఉండేవాడు. కానీ ఫ్లాపుతో గట్టి షాక్ తగిలింది. ఆ తరవాత వస్తున్న సినిమా కాబట్టి – ఈ విజయం విశ్వక్‌కి చాలా కీలకంగా మారింది.
సత్యదేవ్ ఎప్పుడూ మంచి కథలనే ఎంచుకొంటాడు. అయితే.. తనకు కమర్షియల్ హిట్ పడడం లేదు. ‘మంచి ప్రయత్నం’ అనే పేరు వరకూ తన సినిమాలు ఆగిపోతున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతున్న సంగతి సత్యదేవ్ కూడా గ్రహించాడు. అందుకే అన్ని జాగ్రత్తలూ తీసుకొని ‘జీబ్రా’ సినిమా చేశాడు. సత్యదేవ్ కెరీర్లో బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా పెద్ద సినిమా ఇది. మిగిలిన భాషల్లోనూ విడుదల చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరంజీవిని తీసుకొచ్చి బజ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా హిట్టయితే, కెరీర్ పరంగా ఓ అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం నాలుగు అడుగులు వెనక్కి వేసినట్టే. అందుకే ఎక్కడా తప్పు చేయకూడదన్న కృత నిశ్చయంతో ఈ సినిమాని పూర్తి చేశాడు.
ఘట్టమనేని కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన మరో వారసత్వ హీరో గల్లా అశోక్. తొలి సినిమా `హీరో` నిరుత్సాహ పరిచింది. రెండేళ్ల విరామం తరవాత తన నుంచి వస్తున్న సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఆ బ్రాండ్ ఈ సినిమాకు పనికొచ్చింది. మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని విజయతీరాలకు చేరుస్తారని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. హీరోగా అశోక్ గల్లా కెరీర్ ముందుకు వెళ్లాలంటే ఈ సినిమా హిట్ అవ్వడం మినహా మరో మార్గం లేదు.
మెకానిక్ రాఖీ, జీబ్రా చిత్రాలకు గురువారమే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ప్రధాన పట్టణాలలో పెయిడ్ ప్రీమియర్లు ఏర్పాటు చేశారు నిర్మాతలు. వాటికైతే మంచి స్పందనే వస్తోంది. మరి.. శుక్రవారం ఏ రేంజ్లో ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.