Mechanic Rocky Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-
విశ్వక్సేన్ మొదట్నుంచి కాస్త భిన్నమైన కథలనే ఎంచుకొంటున్నాడు. మాస్ సినిమా చేసినా అందులో ఏదో నావెల్టీ ఉంటుంది. ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయా, లేదా? అనేది తరువాతి సంగతి. తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానికి తోడు ఓ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా తనకు తెలుసు. యారగెన్సీ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి – తన సినిమా, తన పేరు ప్రచారంలో ఉంటాయి. అది చాలు తనకు. ఇటీవల తన నుంచి వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిరుత్సాహ పరిచింది. ఈసారి తప్పకుండా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో చేసిన సినిమా ‘మెకానిక్ రాకీ’. మరి ఈ మెకానిక్ ఎలా ఉన్నాడు? తాను కార్లనే కాకుండా… మనుషుల్ని కూడా రిపేరు చేయాల్సి వస్తే ఏం చేశాడు? విశ్వక్సేన్కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది?
రాకీ (విశ్వక్సేన్) ఓ సగటు కుర్రాడు. చదువు అంతంత మాత్రమే. తండ్రి (నరేష్)కు ఓ మెకానిక్ గ్యారేజీ కమ్ డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది. చదువు అటకెక్కడంతో రాకీ కూడా ఓ మెకానిక్‌లా మారి షెడ్ నడుపుతుంటాడు. అయితే ఈ గ్యారేజీపై ఒకరి కన్ను పడుతుంది. రంకి రెడ్డి (సునీల్) అనే దాదా ఎలాగైనా ఆ గ్యారేజీ స్థలాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కాజేయాలనుకొంటాడు. దాన్ని అడ్డుకోవాలంటే రాకీకి రూ.50 లక్షలు కావాలి. మరి ఆ రూ.50 లక్షలు ఎలా సంపాదించాడు? ఈ కథలో మాయ (శ్రద్దా శ్రీనాథ్), ప్రియ (మీనాక్షి చౌదరి)ల పాత్రలేమిటి? అనే విషయాలు తెరపై చూడాలి.
కొత్త కథని అర్థమయ్యేలా చెప్పండి. మామూలు కథని కొత్తగా చెప్పండి.. అంటుంటారు సినీ జ్ఞానులు. అది నూటికి నూరు శాతం నిజం. కొత్త కథలు ఇంజెక్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. కాబట్టి, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాలి. రొటీన్ కథల్ని కొత్తదారిలో చెప్పి, మసి పూసి మారేడు కాయ చేయాలి. ఈ రెండింటిలో ఏ విద్య అబ్బినా సినిమా సక్సెస్ అయినట్టే. ‘మెకానిక్ రాకీ’ రెండో దారిలో వెళ్తుంది. ఓ ఆత్మహత్య ఎపిసోడ్ తో ఈ కథ మొదలవుతుంది. సీరియస్ టోన్ నుంచి వెంటనే బయటకు వచ్చేస్తాడు దర్శకుడు. రాకీ పుట్టు పూర్వోత్తరాలు ఫన్నీగా ఉంటాయి. ఫస్టాఫ్‌లో రాకీ ప్రేమకథ, గ్యారేజ్‌ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప పెద్దగా ఎలాంటి సర్ప్రైజులూ ఉండవు. ఫాదర్ – సన్ రిలేషన్ తో కాస్త టైమ్ పాస్ చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ని పిసినారిగా చూపించడం వల్ల కొంత ఫన్ వచ్చింది. దొంగ బ్యాగ్ కొట్టేసే సీన్ ఒకటి ఫస్టాఫ్‌లో గుర్తుండిపోతుంది.
సెకండాఫ్ లోనే అసలు కథ, మలుపులూ ఉన్నాయి. తొలి ట్విస్ట్ తో… అసలేం జరిగింది? అనే విషయంలో ప్రేక్షకుడికి ఓ క్లారిటీ వస్తుంది. సెకండ్ ట్విస్ట్ అయితే ఊహించలేనిదే. కథలోని పాత్రల్ని ట్విస్టులకు అనుగుణంగా వాడుకొన్న విధానం బాగుంది. నరేష్, సునీల్ పాత్రల్ని మలిచిన పద్ధతి నచ్చుతుంది. ఓ బలమైన సోషల్ ఎలిమెంట్ ఈ సినిమాలో చూపించారు. అదేమిటో రివీల్ చేస్తే ట్విస్టుల్ని ఊహించే అవకాశం ఉంది. అందుకే రివ్యూలో వాటి జోలికి వెళ్లడం లేదు. సినిమా చూసొచ్చాక మాత్రం ‘ఓహో.. ఇలాక్కూడా జరుగుతుందా’ అనే ఫీలింగ్, కాస్త అప్రమత్తత ప్రేక్షకుడిలో కలిగే అవకాశం ఉంది.
ఫస్టాఫ్ డల్ గా సాగుతుంది. దానికి కారణం ద్వితీయార్థమే. ఎందుకంటే ఫస్టాఫ్‌లో కొంచెం ఫ్రీడమ్ తీసుకొని, ఇంకాస్త డీటైల్ గా చెప్పినా, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టుని ఊహిస్తారేమో అని దర్శకుడు భయపడి ఉండొచ్చు. తాను నమ్ముకొంది కూడా సెకండాఫ్ మాత్రమే అనిపిస్తుంది. కాకపోతే.. రాకీ, ప్రియల లవ్ స్టోరీ, గ్యారేజ్‌లో జరిగే సంగతులూ ఇవన్నీ కామెడీ మిక్స్ చేసి చూపిస్తే.. బోరింగ్ ఫ్యాక్టర్ తగ్గేది. ఫస్టాఫ్ ని బాగా నడిపి ఉంటే.. ఈ సినిమా విశ్వక్ కెరీర్లో గుర్తుండిపోయేలా మిగిలిపోయేది. కాకపోతే ఇప్పటికీ నష్టమేం లేదు. ఒక్కసారి థియేటర్లో కూర్చుని చూసేంత స్టఫ్ ఈ సినిమాలో ఉంది. ఫస్టాఫ్‌లో లోపాలు సెకండాఫ్ ముగింపుకు వచ్చేసరికి క్షమించేస్తారు ప్రేక్షకులు.
విశ్వక్ ఎనర్జీ ఈ సినిమాలో ఫుల్లుగా వాడుకొన్నాడు దర్శకుడు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. మాస్ డైలాగులు తనదైన స్టైల్ లో చెప్పి మెప్పించాడు. చాలా రోజుల తరవాత డాన్సులు కూడా చేశాడు విశ్వక్. మీనాక్షి పద్ధతిగా కనిపించింది. తన పాత్రకు మరీ అంత ప్రాధాన్యం లేదేమో అనుకొన్నా.. చివర్లో రాసుకొన్న ట్విస్టుల వల్ల ఆ పాత్ర నిలబడింది. ఈ సినిమాలో సర్ప్రైజింగ్ క్యారెక్టర్ శ్రద్దా శ్రీనాథ్ దే. కాకపోతే.. తన ఆహార్యం అంతగా అతకలేదు. ఈ విషయంలో శ్రద్ద పెట్టాల్సిందే. లేదంటే… ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నరేష్ తన అనుభవాన్ని రంగరించారు. వైవా హర్ష అక్కడక్కడ నవ్వించాడు. హర్షవర్థన్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. సునీల్ ని మొదట్లో భీకరంగా చూపించి ఆ తరవాత సైలెంట్ గా మార్చేశారెందుకు? అనే అనుమానం వస్తుంది. అయితే సినిమా ముగిసేసరికి ఆ అసంతృప్తి ఉండదు.
రవితేజ ముళ్లపూడికి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. ముందే చెప్పినట్టు ఫస్టాఫ్ దగ్గర ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌ని డీల్ చేసిన పద్ధతి బాగుంది. క్యారెక్టర్లన్నీ వాడుకొన్న తీరు నచ్చుతుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. తెలంగాణ యాసలో వచ్చిన పాట రాంగ్ టైమింగ్. మరీ ఇరికించినట్టు అనిపిస్తుంది. కానీ పాట మాత్రం బాగుంది. లవ్ సాంగ్ కూడా బాగా పిక్చరైజ్ చేశారు. కథకు తగ్గట్టుగా నిర్మాతలు ఖర్చు పెట్టారు. ఫస్టాఫ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది.
ట్విస్టుల్ని నమ్ముకొన్న సినిమా ఇది. ఫస్టాఫ్ కాస్త భరించాలి. సెకండాఫ్ కి వచ్చేసరికి పైసా వసూల్ అయిపోతుంది. ఈమధ్య వచ్చిన విశ్వక్ సేన్ సినిమాలకంటే ఇది బెటర్ అవుట్ పుట్ ఇచ్చిందనే చెప్పాలి. ఓసారి హాయిగా చూడ్డానికికైతే ఎలాంటి ఢోకా లేని సినిమా ఇది.
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-