దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది ?. జాగ్రత్తగా కాపలా కాస్తానని నమ్మిస్తాడు. ఎందుకంటే తాను కావాల్సినంత దొంగతనం చేసేశానని డబ్బుపై ఆశ లేదని చెబుతాడు. నమ్మకంగా తాళాలు తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు..? తాళాలు ఇస్తే చాలు.. నేను నిజాయితీగా ఉంటానని అప్పటి వరకూ ఆ దొంగ బలంగా అనుకుని ఉండవచ్చు కానీ.. లోపల బోలెడంత సొత్తు ఉంది చేతిలో తాళాలు ఉన్నాయి.. మనసు లాగకుండా ఉంటుందా?. లాగుతుంది తాళాలు తీసి ఉన్నదంతా ఊడ్చుకుపోతాడు. ఎందుకంటే దొంగ మనస్థత్వమే అది.మారదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విషయంలో అమెరికా వేదికగా బయటపడిన సంచలన అవినీతిని చూస్తే దొంగ చేతికి తాళాలిచ్చి ఎంత తప్పు చేశామో జనం ఇంకో సారి తమను తము నిందించుకుంటారు.
తండ్రి సీఎంగా ఉన్నప్పుడే అడ్డగోలు దోపిడీ
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ రెడ్డి తనకు పట్టనంతగా సంపాదించుకున్నారు. హిమాలయాల్లో పవర్ ప్రాజెక్టుల నుంచి సొంత రాష్ట్రంలో సాక్షి పత్రిక వరకూ ఆయనకు లెక్కలేనంత సంపద ఉంది. తిని కూర్చుంటే ఏడుతరాలు తిన్నా తరగదు. అదేమైనా కష్టపడిన సొమ్మా అంటే ప్రజల్ని.. ప్రజా ఆస్తుల్ని అడ్డగోలుగా దోచుకున్న సొమ్ము. క్విడ్ ప్రో కో పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని , వనరుల్ని సొంత ఆస్తులుగా రాసిచ్చి దానికి ప్రతిఫలంగా తన కంపెనీల్లో అణాకాణీ చేయని షేర్లను వేల రూపాయలకు అమ్మేశారు. చట్టం కళ్లకు గంతలు కట్టగలనని ఆయన గట్టిగా నమ్మారు. దొరికిపోయిన తర్వాత కూడా అదే బొంకారు. ఆయన అవినీతి చేయలేదని ఏపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పరు. ప్రజల్ని దోచుకుతినలేదని ఆయన కూడా చెప్పరు. తన ఐడియాలతో కోట్లు వచ్చి పడ్డాయని అంటారు. ఆయన ఐడియాలు అధికారంలో ఉన్నప్పుడే వస్తాయా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రావు అంటే సమాధానం ఉండదు. ఆయన దోపిడీ తనం చూసి కూడా ప్రజలు 2019లో జాలిపడి ఒక్క చాన్స్ ఇచ్చారు. పదేళ్ల పాటు కష్టపడి తిరిగానని.. తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ఆయన దేబిరి మొహంతో ప్రజల్ని అర్థించడమే కాదు.. తనకు డబ్బు అవసరం లేదని.. డబ్బు మీద వ్యామోహం లేదని ప్రకటించుకున్నారు. అవినీతి లేని సమాజాన్ని సృష్టించడమే తన స్వప్నమన్నారు. గత చరిత్ర ఘనమైన దొంగగా ఉన్నప్పటికీ పాపం మారిపోయాడని ప్రజలు నమ్మారు. తాళాలిచ్చేశారు. ఆయన ఎంత మేర.. ప్రజల రక్తమాంసాలను పిండేశారో కళ్ల ముందే ఉంది. ఇప్పుడు అమెరికాలోనూ అలాంటిది ఒకటి బయటపడింది. రూ. 1750 కోట్లు ఒక్క రూపాయి తగ్గకుండా అదానీ నుంచి లంచం పుచ్చుకున్నారు. ఇక్కడ సీబీఐనో.. ఈడీనో ఈ విషయం చెబితే చంద్రబాబు మేనేజ్ చేసేశారని ఓ చెప్పేసి డబ్బు మూటలు దాచి పెట్టుకోవచ్చు. కానీ ఈ నిజాన్ని బయట పెట్టింది అమెరికా కోర్టు.
పాతికేళ్ల పాటు ఏపీ ప్రజల్ని పీల్చిపిప్పి చేయడానికి అదానీకి చాన్స్ – రూ.1750 కోట్లకు!
సెకీ పేరుతో అదానీ కంపెనీకి పాతికేళ్ల పాటు ప్రజల్ని అప్పగించేస్తూ ఒఒప్పందం చేసుకున్నారు జగన్ రెడ్డి. ఎందుకంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికట. అదేంటయ్యా.. ఇరవై ఏళ్ల నుంచి ఉచిత విద్యుత్ వస్తోంది కదా కొత్తగా ఈ కబుర్లేంటి అంటే విచిత్రంగా చూశారు. ఆ ఒప్పందంలో గూడు పుఠాణి ఏమిటంటే.. మెగావాట్‌కు రూ. పాతిక లక్షల చొప్పున లెక్కగట్టి లంచం వసూలు చేయడం. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న గిగావాట్లకు రూ. 1750 కోట్లు లెక్క తేలితే దాన్ని పుచ్చుకున్నారు. అంటే ఏపీ ప్రజలు పాతికేళ్ల పాటు అత్యధిక విద్యుత్ చార్జీలు అదానీకి కట్టాలి.. అందు కోసం ముందుగానే జగన్ రెడ్డి ఒక్క సారి అధికారం ఇచ్చినందుకు తన వాటా తాను తీసేసుకున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ స్కామ్ ఇండియాలో అయితే బయటపడేదే కాదు. జగన్ రెడ్డి తీసుకున్న ఆ 1750 కోట్ల గురించి గోప్యంగానే ఉండేది. కానీ జగన్ రెడ్డి రోజులు బాగోలేక ఆయన లంచాలు తీసుకున్న అదానీ గ్రూపు అమెరికా కంపెనీ నుంచి పెట్టుబడులు సేకరించింది. ఆ పెట్టుబడులు సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ తో చేసుకున్న ఒప్పందాన్ని చూపించింది. అంటే పావలా పెట్టుబడికి రూపాయి ఆదాయం వచ్చే పాతికేళ్ల పాటు వస్తుందని చెప్పి పెట్టుబడులు సేకరించారు. ఆ సంస్థ అమెరికా స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయింది. తాము గొప్పగా సంపాదించేస్తున్నామని చెప్పి ఆ సంస్థ అక్కడి స్టాక్ మార్కెట్‌కు సమాచారం ఇచ్చింది. ఇదేందో పెద్ద గుూడుపుఠాణి అని అమెరికా న్యాయశాఖతో పాటు అక్కడి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ అంటే స్టాక్ మార్కెట్ నియంత్రించే సంస్త దర్యాప్తు చేసింది. మూడో కంటికి తెలియకుండా చేసిన దర్యాప్తులో ఈ లోగుట్టు అంతా బయటపడింది. అమెరికా దర్యాప్తు ఏజెన్సీలు ఆషామాషీగా ఆరోపణలు చేయవు. పక్కాగా ఆధారాలు ఉంటేనే కేసులు పెడతాయి. ముఖ్యంగా ఇలా అంతర్జాతీయ వ్యవహారాలు ఉన్న విషయాల్లో అయితే ఇంకా కేర్ ఫుల్‌గా ఉంటారు. ఆ సంస్థలు భారత్‌కు జవాబుదారీ కాదు. ఇక్కడ జరిగే అవినీతితో వారికి సంబంధం లేదు. డబ్బులు పుచ్చుకున్న జగన్ రెడ్డికి అమెరికాలో కేసులు ఉండవు. ఎందుకంటే వారు తమ స్టాక్ మార్కెట్లో మ్యానిపులేట్ చేయడానికి లంచాలు ఇచ్చిన వారే ముఖ్యం కానీ.. తీసుకున్న వారు కాదు. అందుకే అదానీ గ్రూపుతో పాటు ఇందులో లిక్ అయిన వ్యాపారవేత్తలపై కేసులు పెట్టారు. మరి జగన్ రెడ్డిపై ఎవరు పెట్టాలి ?
ఇంకా వదిలేస్తారా ?
అదానీ నుంచి జగన్ రెడ్డి వసూలు చేసిన రూ. 1750 కోట్లు ఎక్కడి నుచి ఎక్కడికి వెళ్లాయో కూడా అమెరికా దర్యాప్తు సంస్థలకు తెలుసు . విచారణలో అన్నీ కోర్టు ముందు పెడతాయి. జగన్ రెడ్డి అడ్డంగా దొరికాడన్నది అసలు నిజం. ఆ నిజాలన్నీ బయటపడేదాకా వేచి చూసి జగన్ రెడ్డికి రిలీఫ్ ఇవ్వాలా లేకపోతే ఆ ఆధారాలేమిటో తీసుకుని వెంటనే కేసులు నమోదు చేసి.. లంచాల డబ్బు కక్కించాలా అన్నది ముఖ్యమైన పాయింట్. దొరికిపోయిన ప్రతి దొంగ తాను నిర్దోషిననే చెప్పుకుంటారు. ఇక్కడ జగన్ రెడ్డి కూడా అదే చెప్పుకుంటారు?. కానీ ఆయన అవినీతిని అమెరికా బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు మేనేజ్ చేయలేరు. ఆయనకు విజయవాడలో ఏసీబీ కోర్టును కూడా మేనేజ్ చేయలేక జైలుకెళ్లారు.ఇప్పుడు అలాంటి వాదనలు పసలేనివి. అందుకే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్రం రంగంలోకి దిగాల్సి ఉంది. అందరూ అదానీని అరెస్టు చేయాలని అంటున్నారు. ఆయన చేసింది వ్యాపారం. తము చట్టాలను పాటిస్తామని అత్యున్నమైన విలువల్ని పాటిస్తామని అమెరికా కోర్టులో నమోదైన కేసును తిరస్కరిస్తున్నామని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఆ గ్రూప్ లంచం ఇచ్చిందా లేదా అనేది అమెరికా కోర్టు చూసుకుంటుంది.. తీసుకున్న వారే మన దేశంలో ప్రదాన నిందితుడు. అతను ఇస్తానంటాడు సరే.. ఇక్కడ జనాల్ని తాకట్టు పెట్టేసి తీసుకునేందుకు ఇతను సిద్దపడతాడా?
ఐదేళ్లలో చేసిన దోపిడీ అంతా బయటకు లాగాలి !
నిజానికి ఇది అమెరికాలో బయటపడిన బాగోతం. అంతకు మించి ఐదేళ్ల కాలంలో ప్రజల రక్త మాంసాలు పీల్చాడు. మద్యం విదానాన్ని మార్చి.. తయారీ నుంచి అమ్మకం వరకూ.. చివరికి మద్యం దుకాణాల వద్ద అమ్మే గ్లాసులతో సహా మొత్తం బిజినెస్ గుప్పిట్లో పెట్టుకుని నగదు ద్వారా చేసిన లావాదేవీల్లో ఎన్ని వేల కోట్లు వెకనకేశారో అంచనా వేయడం కష్టం. సీఐడీ చేసిన సోదాల్లో అసలు డిస్టిలరీల్లో తయారు చేసిన మద్యానికి దుకాణాలకు అధికారికంగా సరఫరా చేసిన దానికి పొంతన లేదని వార్తలొస్తున్నాయి. అంటే తయారు చేసి లెక్కా పత్రం లేకుండా అమ్మేసుకున్నారు. అలా అమ్మి తమ ఖాతాల్లో వేసుకున్నారు. అందుకే నగదు లావాదేవీలు. ఒక్క మద్యమేనా ఇసుక దోపిడీని కేంద్రీకృతం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సగటు ఆంధ్దరప్రదేశ్ పౌరుడిగా ఏడుపొక్కటే తక్కువ. అందుకే ప్రతిపక్ష నేత హోదా లేకుండా తుడిచి పెట్టేశారు. కానీ నమ్మి అధికారం ఇచ్చినందుకు ఆయన చేసిన పాపాలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి.
ఓ నేరగాడికి మళ్లీ మళ్లీ నేరాలు చేసే చాన్స్ ఇస్తున్న వ్యవస్థలు
ఓ సారి దొంగతనం చేసిన వ్యక్తిక మరోసారి తాళాలు ఇచ్చేలా మన వ్యవస్థలు ఉండటమే మనం ఇంకా ఎంత ప్రమాదక పరిస్థితుల్లో ఉన్నామో తెలియచేస్తోంది. రూ. 48వేల కోట్లను అధికారికంగా దోచుకున్నట్లుగా సీబీఐ, ఈడీ తేల్చిన తర్వాత విచారణ ఎందుకు పన్నెండేళ్ల కాలంగా జరగడం లేదు ?.అలాంటి ఘోరమైన దోపిడీకి పాల్పడిన వ్యక్తి అంత కాలంగా బెయిల్ పై ఎందుకు ఉన్నారు ?. ఆయన అత్యంత సులువుగా మరోసారి ముఖ్యమంత్రి అయిపోవడానికి ఇలాంటి వ్యవస్థల వైఫల్యమే కారణం కాదా ?. దేశంలో అవినీతి కామన్ అని అందరూ దోచుకుంటున్నారు..నేను దోచుకుంటున్నానన్న ఓ అభిప్రాయాన్ని మీడియాను ఏర్పాటు చేసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల దశం నాశనమైపోతోంది. అమెరికా లాంటి దేశాల ముందు పరువు పోతోంది.ఇప్పటికైనా మన దేశంలో వ్యవస్థల మేలుకుంటాయా లేదా అన్నదే సగటు పౌరుడి సందేహం. ఇలా విచ్చలవిడిగా దోచేసిన సొమ్మును తీసుకు వచ్చి.. ప్రజలకు పంచడమే కాదు.. ఇలాంటి వారిని మరోసారి ప్రజా జీవితంలో ఉంచకుండా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన దేశ రాజకీయాల్లో ఇలాంటి దొంగలదే రాజ్యం అవుతుంది. అప్పుడూ.. అందరూ దొంగా..దొంగ అరుచుకుంటూనే ఉండాలి. ఎందుకంటే.. ఆ దొంగను తెచ్చి పెట్టుకుంది మనమే మరి.. !