వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసే గుడ్డి రాజకీయాలకు ఇది మరో ఉదాహరణ. బలం లేనప్పుడు అధికారపక్షం దయతలిస్తే తీసుకోవాలి లేకపోతే సైలెంటుగా ఉండాలి..కానీ పోటీ చేస్తామని గుడ్డిగా అడుగులు ముందుకు వేస్తే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఇప్పుడు పీఏసీ సభ్యుల ఎన్నికకు ఓటింగ్ చేయడానికి ఆయన అసెంబ్లీకి వెళ్లాలి. వెళ్లకపోతే సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఓటింగ్ వెళ్లని అధ్యక్షుడుగా రికార్డుకెక్కుతాడు. వెళ్తే తాను చేసిన శపధాన్ని తానే తక్కువ చేసుకున్నట్లవుతుంది.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఎన్నికవ్వాలంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి. జగన్ రెడ్డితో కలిసి పదకొండు మంది మాత్రమే ఉన్నారు. ముందు సభ్యుడిగా ఎన్నికయితేనే చైర్మన్ పదవి గురించి ఆలోచించాలి. మండలి నుంచి ఆ పార్టీ తరపున పబ్లిక్ అకౌంట్స్ కమిటీలోకి ఇద్దరు ఎన్నికవుతారు. మరి అసెంబ్లీ నుంచి కూడా పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు. ఇప్పుడు ఓటింగ్ ను స్పీకర్ ఖరారు చేశారు. శుక్రవారమే ఓటింగ్ జరగనుంది.
కూటమి సభ్యుల్లో ఓ పది మంది అసెంబ్లీకి రాలేకపోతే తాము వెళ్లి ఓట్లు వేయాలని వైసీపీ సభ్యులు అనుకుంటున్నారు. అందుకే నామినేషన్ వేయించారని అంటున్నారు. అంత మంది అసెంబ్లీకి రాకపోతారా.. అనే విషయం పక్కన పెడితే అసలు ఇదేం దింపుడు కళ్లెం ఆశలని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఓ రాజకీయ పార్టీ అధినేత వ్యూహాలు ఇలా ఉంటే ఆ పార్టీ దివాలా తీయడానికి ఎక్కవ కాలం పట్టకపోవచ్చు.
అసెంబ్లీలో విప్ పదవులకు ఎన్నికల ఓటింగ్ తర్వాత జగన్ రెడ్డి రాజకీయం ఎంత గందరగోళంగా ఉందో.. నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చేతకానితనం ఎంతగా ఉందో.. వైసీపీ క్యాడర్ కు మరోసారి స్పష్టత వస్తుంది.