అదానీపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆయన కంపెనీలకు చెందిన స్టాక్స్ పేకమేడల్లా కుప్పకూలిపోతున్నాయి. గౌతం అదానీపై అమెరికాలో కేసు నమోదయిందని.. అరెస్టు వారెంట్ జారీ అయిందని తెలియగానే ఇరవై శాతం షేర్ వాల్యూ తగ్గిపోయింది. ఇది మొత్తం రెండు లక్షల ఇరవై వేల కోట్లు. ఇందులో సామాన్య ఇన్వెస్టర్ల సంపదే. అదానీకి ఎంత తగ్గిపోయిందనే సంగతి పక్కన పెడితే ఆయన రూపాయికి.. సామాన్య ఇన్వెస్టర్ రూపాయికి విలువలో ఎంతో తేడా ఉంటుంది.
అదానీకి కంపెనీల షేర్లు పేకమేడల్లా కుప్పకూలిపోవడం మొదటిసారి కాదు. ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడ ఏ ఆరోపణ వచ్చినా ఇది జరుగుతోంది. గతంలో అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ చేసిన ఆరోపణలతో ఇంకా దారుణంగా పడిపోయింది. అప్పుడు ఎంత మంది నష్టపోయారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తింది. అదానీపై అరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు. చాలా దేశాల నుంచి ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
గతంలో శ్రీలంక ప్రాజెక్టు, ఆస్ట్రేలియా బొగ్గు గనులతో పాటు పలు దేశాల్లో ఆయన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా కెన్యా కూడా ఎందుకైనా మంచిదని తమ ఒప్పందాలను రద్దు చేసుకుంది. అదానిపై వచ్చే ఆరోపణల్లో నిజాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు. ఉన్నా బయటకు వస్తాయన్న నమ్మకం కూడా లేదు. కానీ అసలు శిక్ష మాత్రం.. ఇన్వెస్టర్లకు పడుతోంది. అదే అసలు సమస్యగా మారుతోంది.