Zebra Movie review
తెలుగు360 రేటింగ్: 1.75/5
టాలెంట్ వున్నా అదృష్టం కలిసి రాని నటుడు సత్యదేవ్. హీరోగా తనకు ఈపాటికే బ్రేక్ రావాల్సింది. కానీ సరైన సినిమాలు పడలేదు. ఒక దశలో సినిమాలు కూడా తగ్గాయి. అయితే చిరంజీవి గాడ్ ఫాదర్ లో చేసిన విలన్ క్యారెక్టర్ సత్యకు మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ సినిమానే’ జీబ్రా’ అవకాశం తెచ్చింది. దీనికి పుష్పలో జాలి రెడ్డి పాత్రతో పాపులర్ అయిన డాలీ ధనంజయ తోడయ్యాడు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో ఇంకొంత బజ్ క్రియేట్ అయ్యింది. తన కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ సినిమా అని ప్రచారం చేశారు సత్యదేవ్. మరి ఇన్ని విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సత్యదేవ్ కోరుకునే బ్రేక్ ఇచ్చిందా? తనని మరో స్థాయికి తీసుకువెళ్లిందా? ఇంతకీ జీబ్రాలోని కథ ఏమిటి?
సూర్య(సత్యదేవ్) బాట్ అనే బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్. తన జీతం కూడబెట్టుకొని ఓ సొంత ఇల్లు కొనుక్కొని స్వాతి (ప్రియా భవానీ శంకర్)ని పెళ్లి చేసుకోవాలనేది సూర్య కల. స్వాతి కూడా ఓ బ్యాంకు ఉద్యోగే. అనుకోకుండా ఓ రోజు స్వాతి చేసి చిన్న తప్పు వల్ల ఓ వ్యక్తి వేసిన చెక్ రాంగ్ ఎకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి బ్యాంక్ దగ్గరకి వచ్చి ఎలాగైనా తన డబ్బు వెంటనే ఇప్పించాలని పట్టుబడతాడు. విషయం తెలుసుకున్న సూర్య కొన్ని లూప్ హోల్స్ ని వాడుకొని ఏదోలా ఆ డబ్బుని సర్దేస్తాడు. ఇంతలో ఓ ఐదు కోట్ల రుపాయిలు సూర్య పేరుతో ఉన్న ఎకౌంట్ లో జమా అవుతాయి. వెంటనే ఆకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అసలు ఇంత డబ్బు తన పేరుమీద వున్న నకిలీ ఎకౌంట్ లోకి ఎలా వచ్చిందో సూర్యకు అంతుచిక్కదు. ఇంతలో ఆది (డాలీ ధనంజయ)అనే గ్యాంగ్ స్టర్ ఆ ఐదు కోట్లు తనవేనని, నాలుగు రోజుల్లో ఆ డబ్బుని తన అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేయాలని డెడ్ లైన్ పెడతాడు. తర్వాత ఏం జరిగింది? అసలు సూర్య పేరుతో నకిలీ అకౌంట్ తెరచింది ఎవరు? ఆ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయ్యింది? లక్షల కోట్లకు అధిపతైన గ్యాంగ్ స్టర్ ఆది ఓ ఐదు కోట్ల కోసం సూర్య వెంట ఎందుకు పడ్డాడు? ఆ డబ్బుని సూర్య వెనక్కి తీసుకురాగలిగాడా? ఇదంతా మిగతా కథ.
జీబ్రా కథపై నమ్మకంతో ఓ ఐదు నిమిషాల ఫుటేజ్ ని స్నీక్ పీక్ లా ముందుగానే రిలీజ్ చేశారు. బ్యాంకు లూప్ హోల్స్ చుట్టూ డిజైన్ చేసిన ఐదు నిమిషాలు పుటేజ్ నిజంగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. జీబ్రా కథలో మెయిన్ పాయింట్ కూడా అదే. అయితే ఈ కథలో మనీ లాండరింగ్, గ్యాంగ్ స్టర్ అనే మరో రెండు లేయర్లు వున్నాయి. ఈ ఫైనాన్సియల్ క్రైమ్ లో ఆ రెండు లేయర్లు ఆశించినంతగా బ్లెండ్ అవ్వలేదు. బ్యాంక్ రిలేషన్షిప్ మ్యానేజర్ సూర్య తన పాయింట్ వ్యూ నుంచి ఈ కథని ఆసక్తికరంగానే మొదలుపెడతాడు. ముఖ్యంగా చెక్ రాంగ్ డిపాజిట్ చేసి వైనం, తర్వాత బ్యాంక్ లోని లూప్ హోల్స్ ని వాడుకొని ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం చూసినప్పుడు దర్శకుడు బ్యాంకింగ్ వ్యవస్థని నమిలిమింగేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. మున్మందు ఇంకెన్ని మలుపులతో కథని ముందుకు తీసుకెల్తాడో అనే క్యురియాసిటీ క్రియేట్ అవుతుంది. అయితే గ్యాంగ్ స్టర్ ఆది, మనీ లాండరింగ్ కోణంలో గుప్తా (సునీల్) పాత్రలు ప్రవేశించిన తర్వాత కథ ఒక్కసారిగా మందగిస్తుంది. 5 కోట్లు చుట్టూ నడిపిన డ్రామాలో కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా కుదరదు. పరువు అనే ఫీలింగ్ పై ఆ సంఘర్షణని నడిపినా అది ఆడియన్స్ కి పట్టదు. స్టేట్ ఎలక్షన్ కి సరిపడా డబ్బు ఇవ్వగలిగే గ్యాంగ్ స్టర్ ఆది, కమెడియన్ కి ఎక్కువ విలన్ కి తక్కువ లాంటి గుప్తా పాత్ర దగ్గర తన పరువు పోయిందని తెగ ఫీలైపోతూ సూర్య వెంటపడతాడు. ఈ సంఘర్షణ తెరపైకి అది అంత ఎక్సయిటింగ్ గా రాలేదు.
సూర్య తర్వాత ఈ కథలో కీలక పాత్ర అది. ఆ పాత్రని బలంగా, ప్రధాన కథలో భాగం చేస్తూ డిజైన్ చేయాల్సింది. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు అంత కన్విన్సింగ్ గా వుండదు. ఓ రెండు సీన్లు తర్వాత ఆ పాత్ర వలన సూర్య పాత్రకి జరిగే డ్యామేజ్ ఏమీ వుండదనే ఫీలింగ్ ఆడియన్ కి వచ్చేస్తుంది. దీంతో సూర్య ఎంత టెన్షన్ పడుతున్నా దాన్ని ఆడియన్ ఫీలవ్వలేడు.
బ్యాంకింగ్ నేపధ్యంలో వచ్చే సీన్స్ టెక్నికల్ గా కాస్త కాంప్లీకేటెడ్ గా వుంటాయి. టెర్మినాలిజీ, ప్రోసిజర్ అప్పటికప్పుడు అవగాహన చేసుకొని చూడటం మెదడుకు మేతే అయినప్పటికీ ఈ కథలో ఆ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే బ్యాంగ్ మనీ హీస్ట్ ఎపిసోడ్ ఎక్సయిటింగ్ గా తీశారు. నిజంగా ఇలా సాధ్యమౌతుందా అనే ప్రశ్న తొలుస్తున్నా ఆ గేమ్ ప్లాన్ ఆసక్తికరంగా మలిచారు. అక్కడ వచ్చే మలుపులు అలరిస్తాయి. సత్య కామెడీ ఈ ఎపిసోడ్ లోనే మెరుస్తుంది. ఈ కథకు ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు. అయితే ఆ ఎమోషన్ అంత రిజిస్టర్ అవ్వదు. పైగా అనవసరమనే ఫీలింగ్ కూడా కలిగిస్తుంది.
సత్యదేవ్ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న నటుడు. తన స్టయిల్ లోనే సూర్య క్యారెక్టర్ ని చేశాడు. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలతో పోల్చుకుంటే కూల్ అండ్ ఫన్ ఫుల్ క్యారెక్టర్ ఇది. ఈ కథలో తన పోర్షన్ ప్రత్యేకంగా నిలిస్తుంది. డాలీ ధనంజయ ఫుల్ స్వాగ్ తో కనిపించాడు. అయితే ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరులో కొన్ని లోపాలు కనిపిస్తాయి. సత్య ఈ కథలో కాస్త కామెడీ రీలిఫ్. మనీ హీస్ట్ ఎపిసోడ్ లో నవ్విస్తాడు. అయితే అందులో ఓ అడల్ట్ సీన్ వుంది. అది ఎడిట్ చేయాల్సింది. ప్రియా భవానీ ఎప్పటిలానే పద్దతిగా కనిపించింది. షీలా పాత్రలో జెన్నిఫర్ నార్త్ టచ్ తో సాగే క్యారెక్టర్. సునీల్ పాత్రని కొత్తగా డిజైన్ చేశాడు. కొన్ని చోట్ల సీరియస్ గా ఇంకొన్ని చోట్ల పిచ్చి లైట్ గా కనిపించే క్యారెక్టర్ అది. ఆయన మార్క్ డిక్షన్ కొన్ని చోట్ల అలరిస్తుంది. సత్యరాజ్ పాత్ర స్టాక్ మార్కెట్ ఎపిసోడ్ లో కీలకంగా వుంటుంది. ఈ సినిమాలో అన్ని పాత్రలకు జంతువులు పేర్లు మెటాఫర్ గా పెట్టుకున్నాడు డైరెక్టర్. చివర్లో డైనోసర్ వస్తుంది. ఆ పాత్ర చేసిన నటుడు ఎవరో తెరపైనే చూడాలి.
టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంది. క్రైమ్ కథలో ఐదు మాంటజ్ పాటలు కుదిర్చాడు దర్శకుడు. అవి రిజిస్టర్ కావు కానీ కథని ముందుకు తీసుకెళ్ళాయి. ఆర్ఆర్ లో రవిబస్రూర్ మార్క్ అంత కనిపించదు. ఈ సినిమా కోసం బ్యాంక్ సెట్ వేశారు. అది సహజంగా కుదిరింది. నిడివిని ఇంకా కుదించాల్సింది. సెకండ్ హాఫ్ అనవసరంగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాంక్ లూప్ హోల్స్ ని బేస్ చేసుకొని రాసుకున్న ఈ కథలో కొన్ని లూప్ హోల్స్ సరిచేసి వుంటే జీబ్రా పంచే థ్రిల్ మరింత బెటర్ గా వుండేది.
తెలుగు360 రేటింగ్: 1.75/5