భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్, కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శి, సలహాదారులపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తూ పేట్రేగిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనని కట్టడి చేయకపోవడంతో కేంద్రమంత్రులు, భాజపా అధ్యక్షుడు అమిత్ షా అందరూ మౌనం వహించాల్సి వచ్చింది. ఆయన ఇంకా రెచ్చిపోయి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపైనే విమర్శలు గుప్పించడంతో ప్రధాని మోడీ జోక్యం చేసుకొని స్వామిని చాలా సున్నితంగా మందలించారు. బహుశః ఆ కారణంగానే ఆదివారం ముంబైలో సుబ్రహ్మణ్య స్వామి పాల్గొనవలసిన రెండు కార్యక్రమాలు ఆఖరినిమిషంలో రద్దు చేసుకొన్నారని భాజపా నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఆ రెండు కార్యక్రమాలకి సుబ్రహ్మణ్య స్వామి హాజరై ఉండి ఉంటే అయన తప్పకుండా ఎవరో ఒకరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసి ఉండేవారేననడంలో సందేహం లేదు.
అయితే ఏవో రెండు కార్యక్రమాలు రద్దు చేసుకొన్నంత మాత్రాన్న స్వామి వైఖరి పూర్తిగా మారిపోయిందని అనుకోవడానికి కూడా లేదు. ఒకవేళ అయన మళ్ళీ ఎవరిపైనో విమర్శలు చేస్తే మోడీ ఆయనపై చర్యలు తీసుకొంటారా? కనీసం కేంద్రమంత్రులు, భాజపా నేతలైనా నోరువిప్పి గట్టిగా మాట్లాడే సాహసం చేయగలరా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇంతవరకు చెన్నైకే పరిమితమయిన ఆయనని మోడియే డిల్లీకి తీసుకువచ్చారు కనుక. తన ప్రభుత్వంపై చెలరేగిపోతున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను కట్టడి చేసేందుకే సుబ్రహ్మణ్య స్వామిని మోడీ డిల్లీకి తీసుకువచ్చారనే అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్య స్వామి తన చర్యలతో నిజమేనని నిరూపించి చూపారు. అయితే సోనియాగాంధీపై ప్రయోగించాలనుకొన్న ఆ సుబ్రహ్మణ్యాస్త్రం ఇప్పుడు తమ ప్రభుత్వాన్నే దెబ్బ తీస్తుంటే, భాజపా నేతలు, కేంద్రమంత్రులు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
అటువంటి వివాదాస్పద వ్యక్తిని డిల్లీకి తీసుకురావడమే తప్పని ఇప్పుడు భాజపాకి అర్ధం అయ్యింది. కానీ ఆయనని రాజ్యసభ సభ్యుడిగా చేసినందున ఇప్పుడు వెనక్కి త్రిప్పి పంపడం సాధ్యం కాదు. కనుక ఆయనని డిల్లీకి రప్పించిన ప్రధాని నరేంద్ర మోడీయే స్వామిని పూర్తిగా కట్టడిచేయవలసి ఉంటుంది. లేకుంటే పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంటుంది.
సుబ్రహ్మణ్య స్వామి ఇంకా ఇలాగే కేంద్రమంత్రులని, ఉన్నతాధికారులని విమర్శిస్తుంటే, అది ప్రతిపక్షాలకి కూడా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బలమైన ఆయుధం అందించినట్లవుతుంది. అదే జరిగితే అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా సుబ్రహ్మణ్య స్వామిని తెచ్చుకోవడం కొరివితో తల గోక్కొన్నట్లవుతుంది. కనుక సుబ్రహ్మణ్య స్వామిని ప్రధాని మోడీతో సహా అందరూ కలిసి కట్టడి చేయవలసి ఉంటుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామిని కట్టడి చేయడం వారి వల్ల అయ్యే పనేనా…జవాబు కాలమే చెపుతుంది.