devaki nandana vasudeva movie telugu review
తెలుగు360 రేటింగ్: 1.5/5
హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఆయన కథ ఇస్తున్నారంటే అదొక అసెట్ గా మారింది. అశోక్ గల్లా హీరోగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా ప్రశాంత్ వర్మకథతోనే ద్రుష్టిని ఆకర్షించింది. గుణ 369 సినిమా తీసిన అర్జున్ జంధ్యాల దీనికి దర్శకుడు. ఈయన బోయపాటి శిష్యుడు. ప్రాశాంత్ వర్మ కథతో బోయపాటి సినిమా తీస్తే ఎలా వుంటుందో మా సినిమా అలా ఉంటుందని జోరుగా ప్రచారం చేశారు. మరి ఇంతకీ సినిమా ఎలా వుంది ?
విజయనగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో కంసరాజు(దేవదత్త) అంటే హడల్. తన దారికి ఎవరు అడ్డువొచ్చినా ఊచకోత కోస్తాడు. తనకి దైవభక్తి కూడా ఎక్కువే. జాతకాలు, భవిష్యవాణి నమ్ముతాడు. ఓ సారి కాశికి వెళ్ళిన కంసరాజుకి అక్కడో అఘోర.. నీ చెల్లాయికి పుట్టిన మూడో సంతానం వలన నీకు ప్రాణ గండం వుందని హెచ్చరిస్తాడు. దీంతో తొలిసారి గర్భం దాల్చిన చెల్లి ఎదురుగానే తన బావని క్రూరంగా చంపేస్తాడు. ఇక ఆ గండం విముక్తి అయిపోయిందని భావిస్తాడు. ఇదే సమయంలో రెండు హత్యలు చేసిన కేసులో జైలుకెళ్ళిపోతాడు. ఇరవై ఏళ్లు గడుస్తాయి. అదే వూర్లో కృష్ణ (అశోక్ గల్లా) సత్యభామ(మానస వారణాసి)ని ప్రేమిస్తాడు. ఈ సత్యభామ ఎవరో కాదు .. కంసరాజు మేనకోడలు. కృష్ణకి కూడా ఓ గండం వుంటుంది. ఆ గండం ఏమిటి? అసలు కృష్ణ ఎవరు? తనకి కంసరాజుకి వున్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
ఎక్కువమంది చూసేదే కమర్షియల్ సినిమా. అయితే ఈ సింపుల్ సూత్రాన్ని ఇప్పటికీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఐదు పాటలు, నాలుగు ఫైట్లు అనే కోణంలోనే అర్ధం చేసుకుంటున్నారు. రాజమౌళి, శంకర్ లాంటి దిగ్దర్శకులే కొత్తకొత్త బ్యాక్ డ్రాప్ లు, కథలు, వినూత్నమైన స్క్రీన్ ప్లేల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటే.. పాటలు ఫైట్లతో పాసైపోదామని కొందరు మొండి ధైర్యం చేస్తున్నారు. ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా ఈ తానులోని ముక్కే. ప్రశాంత వర్మ ఇచ్చిన కథ ఏమిటో కానీ ఈ కథని దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా రొటీన్ గా వుంది.
భూమిపై ఎక్కడాలేని సుదర్శన చక్రం వున్న కృష్ణుడి విగ్రహంతో మొదలైన ఈ కథ, కాశికి వెళ్లి, అటు నుంచి జైల్లో మగ్గి, రుచిపచి లేని లవ్ ట్రాక్, కంటికానని పాటలు, సంబ్రమాశ్చర్యాలకు గురి చేసే ఓ ట్విస్ట్, నాలుగు వీరనరుకుడు ఫైట్లతో ముగిసిపోతుంది.
ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని చెప్పుకోవడానికి ఏమీ వుండదు. దర్శకుడు కథ ఏమిటి, అందులో ప్రేక్షకులు లీనం అయ్యారా? ఎమోషన్ కనెక్ట్ అయ్యిందా? ఇవేవీ లెక్క చేయలేదు. తనలోని మాస్ మేకర్ ని చూపించడానికే ప్రయత్నించాడు. అటు బీమ్స్ కూడా రెచ్చిపోయి మ్యూజిక్ కొట్టాడు. థియేటర్ లో కాసేపు కళ్ళు మూసుకుంటే నిజంగానే బోయపాటి సినిమాకి వచ్చామా? అనే ఫీలింగ్ కలగకమానదు. హీరో ఇమేజ్, కథ, ఎమోషన్ కి ఎక్కడా సంబంధం లేకుండా పర్ఫెక్ట్ నాన్ సింక్ గా వుంటుందీ సినిమా. ఇక డివైన్ ఎలిమెంట్ అనుకున్న సుదర్శన చక్ర విగ్రహం.. క్లైమాక్స్ ఫైట్ లొకేషన్. అంతకుమించి అది కథలో భాగం కాలేదు. మెలో డ్రామా తరహాలో చక్రం చేసే సంహారమే గొప్ప జస్టిఫికేషన్ అనుకుంటే చేసేది ఏమీ లేదు.
అశోక్ గల్లా మోసే కథ కాదిది. కానీ దర్శకుడు అర్జున్ జంధ్యాల ముందువెనుక చూడకుండా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ కథ సెటప్ లోనే అశోక్ క్యారెక్టర్ ఫిట్ అవ్వలేదు. తన వరకూ కష్టపడ్డాడు. నరాలు చిట్లే డైలాగు చెప్పాడు. యాక్షన్ లో బ్లడ్ బాత్ చూపించాడు. కానీ ఆ ఎమోషన్ వైలెన్స్, ఆడియన్స్ ఫీలయ్యేలా వుండదు. కంసరాజు పాత్రలో చేసిన దేవదత్తనే మొత్తం స్క్రీన్ ఆక్రమించాడు. పెద్ద హీరోల సినిమాలకు విలన్ మెటిరియల్ తను. కొత్త అమ్మాయి మానస వారణాసి కొన్ని చోట్ల అందంగా ఇంకొన్ని చోట్ల క్లూస్ లెస్ గా కనిపించింది. దీనికి కూడా ఒక కారణం వుంది. అది సినిమా చూసి తెలుసుకోవాలి. తొలి సినిమాకే ఆమెపై మూడింతల భారం పెట్టారు. దేవయాని హుందాగా కనిపించింది. శత్రుని కామెడీ క్యారెక్టర్ చేసేశారు. వెంకటేష్ కాకమాను, గెటప్ శీను ఎందుకున్నారో తెలీదు.
బీమ్స్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే.. అదో వీర బాదుడు. కెమరాపని తననం, ప్రొడక్షన్ వాల్యూస్ కమర్షియల్ మీటర్ లో సాగిపోయాయి. సాయి మాధవ్ బుర్రా మాటలు గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాలి. రాయాల్సిన చోట బలమైన మాటలే రాశారు. చాలా చోట్ల కథలో లోపాలని కవర్ చేస్తూ ఆయన మాటలు సాగాయి. చివర్లో కథ సారాన్ని, విధి రాతని గురించి చెప్పే మాటలు ఆయన స్థాయికి తగ్గట్టుగా వున్నాయి. రెండో సినిమాకే అశోక్ ని మాస్ మూలవిరాట్ చిత్రీకరించిన దర్శకుడు ఆడియన్స్ పల్స్ ని పట్టుకోవడం పూర్తిగా లెక్క తప్పాడని చెప్పకతప్పదు.
తెలుగు360 రేటింగ్: 1.5/5