ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాట తప్పుతున్న నరేంద్ర మోడీ ఇప్పుడు బీహార్ రాష్ట్ర ప్రజలకు అటువంటి హామీనే గుప్పిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.50,000 కోట్లు ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీనే ఇంతవరకు ఆయన ప్రభుత్వం అమలుచేయలేదు. ఎన్నికల సమయంలో చాలా ధాటిగా అనర్గళంగా మాట్లాడే ప్రధాని మోడీ, ప్రతిపక్షాలు దానిపై ఆయనను లోక్ సభలో ప్రకటన చేయమని కోరుతున్నప్పటికీ మాట్లాడకుండా మౌనంగా కూర్చొంటున్నారు. కానీ బీహార్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రం “జబ్బు చేసిన బీహార్ రాష్ట్రాన్ని బాగుచేయాలంటే బీజేపీకే ఓటేసి గెలిపించాలని, తమ పార్టీ అధికారంలోకి వస్తే గాడితప్పిన బీహార్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడుతుందని అందుకోసం రూ. 50,000 కోట్లు ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని బీహార్ ప్రజలకు ప్రధాని మోడీ చాలా గట్టిగా హామీ ఇస్తున్నారు.
ఆయన చెపుతున్న ఈ మాటలు వింటుంటే ఆనాడు ఆంద్రప్రదేశ్ ఎన్నికల ప్రచారసభలో చెప్పినట్లుగానే ఉన్నాయని అర్ధమవుతోంది. రాష్ట్రంలో, పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని ఈ హామీల గురించి కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదీస్తోంది. కానీ ఇదే అంశాన్ని బీహార్ ఎన్నికల ప్రచారసభలో కూడా హైలైట్ చేయగలిగితే బీజేపీకి ఎదురీత తప్పదు. జనతా పరివార్ తో కలిసిన కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా ఇంకా ఈ విషయం గ్రహించలేదో లేక గ్రహించి కూడా గ్రహించనట్లు నటిస్తోందో తెలియదు కానీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ మిత్ర పక్షాలు ప్రధాని మోడీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న ఈ అన్యాయం గురించి గట్టిగా చెప్పుకోగలిగితే బీజేపీకి విజయావకాశాలను గండికొట్టడం తధ్యం.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రగులుకొన్న ప్రత్యేక హోదా ఉద్యమాల కారణంగా తెదేపా కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఒకవేళ బీజేపీతో ఇంకా అంతకాగినట్లయితే తమ పార్టీకి నష్టం కలుగుతుందని తెదేపా భావిస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి వెనుకాడకపోవచ్చును. అదే జరిగితే, అది కూడా బీహార్ లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు బీజేపీ తప్పుని రుజువు చేసేందుకు మరొక గొప్ప ఆయుధంగా మారుతుంది. ఆంద్రప్రదేశ్ ప్రజలని, మిత్రపక్షమయిన తెదేపాని కూడా బీజేపీ మోసగించింది కనుకనే తెదేపా దానితో తెగ తెంపులు చేసుకొందని, కనుక బీజేపీని నమ్మి ఓటేసినట్లయితే బీహార్ ప్రజలను అదే విధంగా మోసం చేస్తుందని కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రచారం చేసుకొనే అవకాశం కలుగుతుంది. కనుక బీజేపీ చేజేతులా అటువంటి దుస్థితి కల్పించుకోకుండా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తన హామీని నిలబెట్టుకొంటే అదే మాట బీహార్ ఎన్నికలలో కూడా గట్టిగా ప్రచారం చేసుకొని లబ్ది పొందవచ్చును. కానీ ఆంద్రప్రదేశ్ ప్రజలకి హ్యాండిస్తే దానికి బీహార్ లో పరాభవం ఎదురయ్యే అవకాశాలున్నాయి.