రెండు తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ ఎవరినీ నొప్పించకుండా అందరినీ మెప్పించేవిధంగా పనిచేసుకొనిపోతున్నారు. అది కత్తి మీద సామువంటిదేనని చెప్పవచ్చు. ఆయన యూపియే హయంలో కాంగ్రెస్ పార్టీ చేత నియమింపబడిన వ్యక్తి అయినప్పటికీ మోడీ ప్రభుత్వం కూడా ఆయననే గవర్నర్ గా కొనసాగిస్తోందంటేనే ఆయన ఎంత సమర్ధంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక నిత్యం కీచులాడుకొనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని సముదాయించుకొంటూ పని చేయడం ఇంకా కష్టమైనా పనే. ఆ విషయంలో కూడా ఆయన ఇద్దరు ముఖ్యమంత్రుల సాధ్యమైనంత వరకు వేలెత్తి చూపించుకోకుండా తనపని తాను చక్కగా చేసుకొనిపోతున్నారు. అయినా కూడా ఒక్కోసారి తన ప్రమేయం ఏమి లేకుండానే ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అటువంటిదే ఒక సమస్య వచ్చి పడింది ఆయనకి.
తెలంగాణా రాష్ట్రానికి ఈ రెండేళ్ళ వ్యవధిలో సుమారు రూ. 90,000 కోట్లు విలువచేసే ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేసినట్లుగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూర్యాపేట భాజపా సభలో ప్రకటించారు. దానిని తెలంగాణా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తో సహా చాలా మంది మంత్రులు గట్టిగా ఖండించారు. జాతీయ స్థాయి నేత అయిన అమిత్ షా ఆ విధంగాఅబద్దాలు చెప్పడం సరికాదని విమర్శించారు. ఆయన చెప్పిన దానిలో సగం కూడా ఇవ్వలేదని వాదించారు.
దక్షిణాది రాష్ట్రాలలో భాజపాని బలోపేతం చేసుకోవడానికి తెలంగాణా రాష్ట్రమే చాలా అనుకూలమైనదని భాజపా అధిష్టానం భావిస్తోంది. అందుకే నిధుల గురించి గట్టిగా చెప్పుకొంటోందని భావించవచ్చు. కానీ తెలంగాణా ప్రభుత్వం నిధులు అందడం లేదని వాదిస్తోంది.
ఆంధ్రాపై కూడా భాజపా కన్ను ఉన్నప్పటికీ అక్కడ తెదేపాతో పొత్తులు పెట్టుకొంది కనుక అక్కడ పూర్తి పట్టు సాధించాలంటే తెదేపాతో తెగతెంపులు చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో అటువంటి ఆలోచనలు చేయడం మంచిది కాదు కనుక చేయడం లేదు. తెలంగాణాలో తెరాసతో ఎటువంటి సంబంధమూ లేదు కనుక అక్కడ మాత్రం అడుగు ముందుకు వేసేందుకు పావులు కదుపుతోంది. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే గవర్నర్ ఇంతవరకు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఖర్చు చేసింది? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణా ప్రభుత్వాధికారులు నిధులు, ఖర్చుల లెక్కలు కట్టి ఆయనకి నివేదించారు.
వారిచ్చిన అధికార లెక్కల ప్రకారం కేంద్రప్రభుత్వం ఈ రెండేళ్లలో రూ.50,000 కోట్లు వరకు ఇచ్చినట్లు తేలింది. అంటే తెరాస మంత్రులు అబద్ధం చెప్పారని స్పష్టం అవుతోంది. ఆ వివరాలను ఆయన కేంద్రప్రభుత్వం చేతిలో పెడితే, అది భాజపా అధిష్టానానికి, తిరిగి రాష్ట్ర భాజపా నేతల చేతికి అందుతుంది. అప్పుడు వారు తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలుగుతారు.