శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు రంగంలోకి దిగుతోంది. సీబీఐ చీఫ్ ఆద్వర్యంలో ఇద్దరు సీబీఐ ఆఫీసర్లు, ఇద్దరు రాష్ట్ర ఆఫీసర్లు, ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారితో సిట్ నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు డాక్టర్ సత్యేన్కుమార్ పాండా ఉన్నారు.
సిట్ కోసం తిరుపతిలో టీటీడీ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం నుంచే సిట్ తమ విచారణ నిర్వహించనుంది. 30 మందితో ప్రత్యేక టీంను కూడా వీరికి సహాయంగా నియమించారు. వీరిలో 4 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 2 ఎస్సైలు ఉన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమించిన సిట్ చాలా వరకూ విచారణ చేసింది. పాత సిట్ సేకరించిన సమాచారాన్ని కొత్త సిట్ పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉంది.
ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగిందని ఎఫ్ఎస్ఎస్ఐఏ కూడా నోటీసులు జారీ చేసింది. అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా చేశారన్న దగ్గర నుంచి సామర్థ్యం లేకుండా ఎక్కడి నుంచి నెయ్యి సేకరించారన్నది కూడా బయటకు తీయనున్నారు. మొత్తంగా సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత .. లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నేడో రేపో ఐదుగురు సభ్యుల సిట్ బృందం తిరుపతి చేరుకోనుంది.