ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడ్ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పురందేశ్వరికి జాతీయస్థాయి బాధ్యతలు ఇస్తారని రాష్ట్రంలో కొత్త నేతకు చాన్సిస్తారని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే అధ్యక్షుడ్ని నియమించడానికి కసరత్తు పూర్తి చేశారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చేందుకు చేస్తున్న కసరత్తులో తాజాగా ఏపీని చేర్చినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు హఠాత్తుగా తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్లుగా ఉన్న బండి సంజయ్ , సోము వీర్రాజులను తొలగించి కిషన్ రెడ్డి, పురందేశ్వరిలకు చాన్సిచ్చారు. ఆ మిషన్ పూర్తియంది. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో గాడిన పెట్టేందుకు కొత్త చీఫ్ లను నియమించాలని అనుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్ష ఎంపిక క్లిష్టంగా మారింది. చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఏపీలో మాత్రం ఎవరు పోటీ పడినా హైకమాండ్ చాయిస్ కీలకం కానుంది.
వైసీపీ పరిస్థితి దీనంగా మారుతూండటంతో.. ఈ సారి రెడ్డి వర్గానికి చెందిన రాయలసీమ నేతకు చాన్సిస్తారని అంటున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఆయన బీజేపీలో చేరిందే అవకాశాల కోసమని… పార్టీ కోసం కాదన్న వాదన కొంత మంది వినిపిస్తున్నారు. మరి వారి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో?