ప్రియాంకా గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. ప్రత్యక్షరాజకీయాల్లో మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేశారు ప్రియాంక. వాయనాడ్ ప్రజలు ఆదరించారు.రెండో స్థానంలో కమ్యూనిస్టు పార్టీ ఉండగా బీజేపీకి అక్కడ డిపాజిట్ కూడా దక్కడం కష్టంగా కనిపిస్తోంది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేసిగెలిచారు. వాయనాడ్ తో పాటు రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు. సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించడంతో ఆమె వారసుడిగా రాయ్ బరేలీలోనూ పోటీ చేశారు.రెండు చోట్ల విజయం సాధించడంతో వాయనాడ్ సీటు ఖాళీ చేసి ప్రియాంకా గాంధీకి అవకాశం కల్పించారు. అక్కడ్నుంచి ప్రియాంక ఘన విజయం సాధించారు.
గాంధీ కుటుంబం నుంచి రాజకీయాల్లో మరొక వారసురాలి ఇన్నింగ్స్ ప్రారంభమయిందని అనుకోవచ్చు. చూడటానికి ఇందిరాగాంధీ రూపురేఖల్లో ఉండే ప్రియాంక..మంచి వాగ్దాటి ఉన్న నాయకులు. అన్ని విషయాలపై సంపూర్ణమైన పరిజ్ఞానం కూడా ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దక్షిణాదిలో పార్టీ పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత తీసుకుంటారని అనుకుంటున్నారు.