వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీని వదిలి పెట్టేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ శాసన మండలి చైర్మన్ వద్ద మూడు రాజీనామాలు పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం నాలుగోది. కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి నుంచి టీడీపీ నేత. మాజీ ఎమ్మెల్యే. కానీ ఎన్నికలకు పది నెలల ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ఆఫర్ చేయడంతో ఆ పార్టీలో చేరిపోయి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిపోయారు.
కూటమి అధికారంలోకి రావడంతో ఆయన ఉక్కపోతకు గురవుతున్నారు. దీంతో పాత పార్టీ నేతల్ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. చివరికి పదవి కూడా వదిలేసి వస్తే ఆలోచిస్తామని చెప్పడంతో ఆయన పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరపున ఎవరు రాజీనామా చేసినా మళ్లీ ఆ పదవి వైసీపీకి వచ్చే అవకాశం లేదు. ఒక వేళ తాము చేరబోయే పార్టీ అంగీకరిస్తే రాజీనామా చేస్తున్న ఎమ్మెల్సీ పదవులు వారికే వస్తాయి. లేకపోతే మరో పదవి కోసం వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, సుంకర పద్మశ్రీలు ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని వారు పదే పదే శాసనమండలి చైర్మన్ ను కోరుతున్నా నిర్ణయం తీసుకోవడం లేదు. జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిఉంది.