టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ ఎవరంటే… ప్రశాంత్ వర్మ పేరే చెబుతున్నారు. హనుమాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ తీసిన దర్శకుడీయన. ప్రశాంత్ వర్మ సినీ యూనివర్స్ పేరుతో… చాలా సినిమాలే రూపుదిద్దుకొంటున్నాయి. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చివరి దశలో ఉంది. హనుమాన్ 2కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఓ సినిమా చేస్తున్నాడు. తన కథలతో కొన్ని సినిమాలూ తెరకెక్కుతున్నాయి. శుక్రవారం విడుదలైన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి ప్రశాంత్ వర్మనే కథ అందించారు. ప్రశాంత్ వర్మ కథ ఇవ్వడం వల్ల ఈ సినిమాకు విడుదలకు ముందే మైలేజీ వచ్చింది. ప్రశాంత్ వర్మ ఏదో అద్భుతం సృష్టిస్తాడని ఆశించారు అంతా. కథ కూడా ప్రశాంత్ వర్మ స్టైల్ లోనే సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ మిక్సయి ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ ఏకంగా రూ.2 కోట్లు తీసుకొన్నాడని టాక్. ఓ కథకు రెండు కోట్లంటే చాలా పెద్ద మొత్తమే. ప్రశాంత్ వర్మ క్రేజ్ లో ఉన్న దర్శకుడు కాబట్టి, అడిగినంత ఇచ్చి ఉండచ్చు.
కానీ శుక్రవారం విడుదలైన ఈ సినిమా చూస్తే ఈ కథకు రెండు కోట్లు ఇవ్వడం అవసరమా? అనిపిస్తుంది. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. లాజిక్కుల జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఏం చూసి ఈ కథకు రెండు కోట్లు ఇచ్చారో నిర్మాతలకే తెలియాలి. బహుశా.. ప్రశాంత్ వర్మ కథ కాబట్టి, సినిమాకు అంతో ఇంతో మైలేజీ వస్తుంది కాబట్టి అడిగినంత ఇచ్చి ఉండొచ్చు. ఓ పేరుని బ్రాండ్ ఇమేజ్ గా మారిస్తే వచ్చే ప్రతిఫలం ఇది. ఇటీవల ‘ద మిస్టరీ ఆఫ్ మోక్షాస్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్‌కూ ప్రశాంత్ వర్మనే కథకుడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా కూడా మంచి పారితోషికమే రాబట్టుకొన్నాడు ప్రశాంత్ వర్మ. కానీ ఓటీటీలో ఈ సిరీస్‌కు ఎలాంటి ఆదరణ రాలేదు. ప్రశాంత్ వర్మ రాసుకొన్న కథలన్నీ తానే డైరెక్ట్ చేయలేడు. ఇలా కథల్ని అమ్ముకొంటే ఆర్థికంగా లాభాలుంటాయి. కాకపోతే… తన కథలు ఫ్లాప్ అయితే ఆ ప్రభావం అంతో ఇంతో ప్రశాంత్ వర్మపై పడుతుంది. ఈ విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకొంటే మంచిది.