స్వదేశంలో పులుల్లా విజృంభించే టీమ్ ఇండియా ఆటగాళ్లు న్యూజీలాండ్ తో జరిగిన సిరీస్‌లో చతికిలపడ్డారు. ఎన్నడూ లేనంత భారీ పరాజయాన్ని మూటగట్టుకొన్నారు. 3-0 తేడాతో ఆ సిరీస్ భారత్ ఓడిపోయింది. స్వదేశంలోనే భారత్ ఇంత దారుణంగా ఆడితే, ఆసీస్ తో జరిగే సిరీస్‌లో ఇంకెంత చెత్తగా ఆడతారో అని భారత అభిమానులు బెంగ పడ్డారు. దానికి తగ్గట్టుగానే పెర్త్ లో మొదలైన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది. అయితే ఆసీస్‌ను అనూహ్యంగా 104 పరుగులకు ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన ఆధిక్యం సంపాదించుకొంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 172 పరుగులు సాధించింది. మొత్తానికి భారత్ ఆధిక్యం 218 పరుగులకు చేరుకొంది. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి కాబట్టి కనీసం మరో 200 పరుగులు జోడించినా భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఖాయం.
ఓపెనర్లు జైస్వాల్ (90 బ్యాటింగ్), రాహుల్ (62 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇద్దరికీ రెండుసార్లు జీవన దానాలు లభించాయి. వాటిని ఈ ఓపెనర్లు సద్వినియోగం చేసుకొన్నారు. తొలి రోజు 17 వికెట్లు పడితే… రెండో రోజు కేవలం 3 వికెట్లే దక్కాయి. దాన్ని బట్టి ఈ పిచ్ క్రమంగా బ్యాటర్లకు అనుకూలిస్తుందేమో అనిపిస్తోంది. నాలుగో రోజు స్పిన్‌కు ఈ పిచ్ సహకరించవచ్చు. కనీసం 400 పరుగుల టార్గెట్ విధిస్తే ఈ ఆసీస్‌కు టార్గెట్ ఛేదించడం కష్టం అవుతుంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు సంపాదించాలంటే ఈ సిరీస్ లో విజయం సాధించడం భారత్‌కు చాలా అవసరం. తొలి టెస్ట్ మనదైతే, ఈ సిరీస్ పై పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి.