ఏపీలో టీడీపీ అనితర సాధ్యమైన విజయం సాధించినప్పుడు అందరూ షో టైమ్ కన్సల్టెన్సీ గురించి చెప్పుకున్నారు. ఆ సంస్థనే టీడీపీకి పని చేసింది. ఐ ప్యాక్ ఓ వైపు వైసీపీకి పని చేస్తోంది. కావాల్సినంత ఆర్థిక బలం ఉంది. అయితే పొలిటికల్ ప్లాన్లకు కావాల్సింది ఆర్థికబలం కాదని బుద్దిబలమని షోటైమ్ నిరూపించింది. ఆ సంస్థ కెప్టెన్ రాబిన్ శర్మ .. మొత్తంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో కూటమికి అరుదైన విజయం అందించడానికి తన ప్రొఫెషనల్ సాయం చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం వెనుక వారి పాత్ర ఉంది.
చంద్రబాబునాయుడుతో మాట్లాడి మరీ షో టైమ్ కన్సల్టెన్సీతో శివసేన చీఫ్ ఏకనాథ్ షిండే ఒప్పందం చేసుకున్నారు. రంగంలోకి దిగిన షో టైమ్ సిబ్బంది..తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఏకనాథ్ షిండే శివసేన తరపున పోటీ చేసిన దాదాపుగా ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. ఈ విజయం వెనుక షోటైమ్ కృషి కూడా ఉందని మహారాష్ట్ర రాజకీయవర్గాలకు తెలుసు. షో టైమ్ అంతకు ముదంు మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీకి పని చేసింది. అక్కడ కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఇది తమకు హ్యాట్రిక్ అని ఆ సంస్థ ప్రకటించుకుంది.
షో టైమ్ చీఫ్ రాబిన్ శర్మ .. ఒకప్పుడు ఐ ప్యాక్ సభ్యుడే. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో వీరంతా టీమ్ గా ఏర్పడి రాజీకయాల్లోకి కన్సల్టెన్సీ సేవలు తెచ్చారు. తర్వాత రాబిన్ శర్మ సొంత సంస్థ షో టైమ్ ను ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ నుంచి వెళ్లిపోయారు. ఏపీలో వైసీపీ పరాజయంతో ఐ ప్యాక్ ప్యాకైపోయిది. ఇప్పుడు అంతా షో టైమ్ కన్సల్టెన్సీ హవా నడుస్తోంది. ఆ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు చాలా మంది రెడీ అవుతున్నారు.యూపీలో సమాజ్ వాదీ పార్టీ షో టైమ్తో ఒప్పందం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.