కొండా సురేఖపై కేటీఆర్ వేసిన రూ. వంద కోట్ల తరహాలోనే కేటీఆర్ పై సూదిని సృజన్ రెడ్డి కూడా వంద కోట్లకు దావా వేశారు. అసత్య ఆరోపణలతో తన పరువు తీశారని.. నిజాలేమిటో తాను చెప్పినా పట్టించుకోకుండా పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారని సూదిని సృజన్ రెడ్డి అంటున్నారు.
సూదిని సృజన్ రెడ్డి .. రేవంత్ రెడ్డి బావమరిది అని ప్రచారం చేస్తూ కేటీఆర్.. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే సృజన్ రెడ్డి రేవంత్ భార్యకు డైరక్ట్ సోదరుడు కాదు. ఇంటిపేరు ఉంది…కానీ చాలా దూరపు చుట్టం. ఈయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు. ఆయనకు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని కాంట్రాక్టులు వచ్చాయి. అంతే కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితతో లావాదేవీలు నిర్వహించినట్లుగా ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.
అయితే అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని.. ఈ సృజన్ రెడ్డికి అక్రమంగా టెండర్లు ఇచ్చారని ఆరోపణలు చేస్తూ కేటీఆర్ ఢిల్లీ వరకూ వెళ్లారు. తన ఫిర్యాదు ఆధారంగా రేవంత్ ను అరెస్టు చేయకపోతే బీజేపీ, కాంగ్రెస్ మధ్య లింకులు ఉన్ననట్లేనని అంటున్నారు. కానీ ఈ సృజన్ రెడ్డి మాత్రం వేరే దారిలో వచ్చారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే.. చేయాల్సింది చేస్తానని కోర్టుకు వెళ్లారు. కేటీఆర్ పై ఆరోపణలు చేస్తే ఆయన కోర్టుకు వెళ్లారు..మరి ఆయన ఆరోపణలు చేసే వారు కోర్టుకెళ్లడంలో తప్పే లేదు. ఎవరి హక్కులు వాళ్లకు ఉంటాయిగా !