వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఇప్పటికి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. ఇంకా చాలా మంది దారిలో ఉన్నారు. జగన్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా తాము నిండా మునిగిపోయే పరిస్థితిలో ఉన్నామని అనుకుంటున్న ఎక్కువ మంది నేతలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో అత్యంత సీనియర్లు కూడా ఉన్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
శాసనమండలి సభ్యులలో నలుగురు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదించలేదు కానీ..మరో పదిమంది వరకూ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. మండలికి వచ్చినా సైలెంటుగా గా కూర్చుని వెళ్లిపోవారు. వైసీపీ సభ్యులతో కలిసి టీడీపీ సభ్యులపై విరుచుకుపడేందుకు సిద్దపడలేదు. అందుకే పది మంది సభ్యులే టీడీపీకి మండలిలో ఉన్నా.. అధికారికంగా 30కిపైగా సభ్యులు వైసీపీకి ఉన్నా కనీస ప్రభావం చూపలేకపోయారు.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలలో అత్యధిక మంది తమ దారి తాము చూసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూడు కూటమి పార్టీల్లో ఎక్కడ చాన్స్ వచ్చినా చేరిపోయేందుకు రెడీ అంటున్నారు. సిక్కోలు నుంచి నెల్లూరు వరకూ ఈ పరిస్థితి ఉంది. వచ్చే ఆరు నెలల్లో వైసీపీ నుంచి వలసల సునామీ ఉంటుందని క్యాడర్ కూడా నిలబడటం కష్టమన్న వాదన వినిపిస్తోంది.