ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకొన్న విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లలో తేలిపోతున్నాడు. తన నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ చూసి చాలా కాలమైంది. ఆసీస్ తో మొదలైన తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్ లోనూ కోహ్లీ నిరాశ పరిచాడు. కోహ్లీ ఫామ్ పై భీకరమైన అనుమానాలు నెలకొన్న వేళ ఓ చక్కటి సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కొంటూ శతకం బాదాడు. టెస్ట్ మ్యాచ్లలో సెంచరీ చేయడం 16 నెలల తరవాత కోహ్లీకి ఇదే తొలిసారి.
ఆసీస్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. కోహ్లీ (143 బంతుల్లో 100) సెంచరీ చేయగానే కెప్టెన్ బుమ్రా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతకు ముందు జైస్వాల్ (161) భారీ సెంచరీ బాదాడు. భారత బ్యాటర్ల లో రాహుల్ (77), నితిన్ రెడ్డి (38 నాటౌట్) ఆకట్టుకొన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. పిచ్ బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా సహకరిస్తోంది. చివరి రెండు రోజులూ స్పిన్ కి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో ఫలితం తేలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్ లోలా విజృంభిస్తే ఆసీస్ తో మ్యాచ్ నాలుగో రోజే ఫలితం తేలిపోవొచ్చు.