ఆస్తి ఇచ్చినా సరే ఇక తగ్గేది లేదని షర్మిల తేల్చేశారు. జగన్ మోహన్ రెడ్డి నిర్వాకాల గురించి ఆయన .. రాజకీయ పద్దతుల గురించి తమకు చేసిన అన్యాయం గురించి ప్రశ్నించకుండా ఉండబోనని స్పష్టం చేశారు. అదానీ విషయంలో జగన్ రెడ్డి లంచాలు తీసుకున్నట్లుగా అమెరికా కోర్టు నిర్దారించినందున అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు..తనను ఉపయోగించుకుని రాజకీయ లబ్ది పొందాలనుకునే ప్రయత్నాలను షర్మిల గట్టిగా తిప్పి కొడుతున్నారు.
గతంలో ఓ సినీ హీరో విషయంలో తనను అప్రతిష్టపాలు చేసింది జగనేనని ఆమె ఆరోపించి సంచలనం సృష్టించారు. ఆమె సాయంతో కేసులు పెట్టి టీడీపీ సోషల్ మీడియాను ఇబ్బంది పెట్టారు. అది సరిపోదని ఇప్పుడు ఆ పాత వీడియోను తీసుకు వచ్చి మీడియా ముందు ప్రదర్శించి అదే గొప్ప తెలివి అనుకున్నారు. కానీ షర్మిల రివర్స్ లో ఇచ్చిన షాక్కు ఒక్కరి వద్ద సమాధానం లేదు. జగన్ రెడ్డి వద్ద లేదు. ఇంకా మాట్లాడితే ఇంకా ఎన్ని విషయాలు బయటపెడుతుందో అన్న భయం వైసీపీ వర్గాల్లో ఉంది.
జగన్ రెడ్డి నీచ రాజకీయాలకు తల్లి, చెల్లిని పావుగా వాడుకున్నారు. వారి అవసరం తీరిపోయాక పట్టించుకోవడం మానేశారు. కానీ వారు పట్టించుకోవడం ప్రారంభించారు. ఇప్పుడే అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. జగన్ రెడ్డి ఇప్పుడు ఆస్తుల్లో ఒప్పుకున్నట్లుగా వాటాలు పంచేస్తానని రాయబారం పంపినా షర్మిల రాజకీయంగా వెనుకడుగు వేసే పరిస్థితుల్లో లేరు. తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. షర్మిల దూకుడును అడ్డుకోవడం జగన్కు అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది.