రియల్ ఎస్టేట్ అంటే ఓ కుటుంబం జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్మును అడ్డగోలుగా దోచుకోవడం అనే వాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో జరిగిన మోసాలకు తోడు మరో రకమైన మోసం కూడా జరిగింది. ప్రధానంగా ఇంటి స్థలాలను కొనాలనుకునేవారిని టార్గెట్ చేసి ఈ మోసాలు జరిగాయి. ఈ మోసం పేరు బై బ్యాక్ ఆఫర్.
సువర్ణభూమి సంస్థ వచ్చే ఇరవై ఏళ్లకు కూడా అక్కడ ఇళ్లు కట్టుకునే పరిస్థితి ఉంటుందో లేదో ఊహించలేని మరుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి స్థలాలు అమ్మేసింది. అందు కోసం ఆ సంస్థ వేసిన ప్లాన్… బై బ్యాక్ ఆఫర్లు. ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తే మూడేళ్ల తర్వాత ఎక్కువకు తామే కొంటామని ఆఫర్లు ఇచ్చింది. దాంతో చాలా మంది కొనుగోలు చేశారు. తీరా మూడేళ్లు గడిచిన తర్వాత వడ్డీ పోయినా పర్వాలేదు అసలు మొత్తానికి అయినా కొనడం లేదు. ఇదే అంశంపై కొనుగోలుదారులు సంస్థతో గొడవపడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే రీసేల్ చేద్దామంటే మార్కెట్ బాగోలేదని.. తామే కొంటామని చెప్పలేదని సువర్ణభూమి సంస్థ ప్రతినిధులు అడ్డం తిరిగుతున్నారు.
ఒక్క సువర్ణభూమే కాదు.. ఇలాంటి మోసాలు చాలా మంది చేశారని తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. శివారులోని వేసిన వెంచర్లకు సంబంధించి … ఇళ్లు కట్టుకునే అవకాశం మరో పదేళ్ల తర్వాత కూడా వస్తుందో లేదో తెలియని స్థలాలను కూడా అమ్మేశారు. వీటన్నింటి వెనుక ఉన్నది ఈ బ్యాక్ రహస్యమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంస్థలు ఇలా ఆఫర్లు ఇచ్చి మూడు, నాలుగేళ్లు గడువులు పెట్టాయి.ఇప్పుడు ఆ గడువులు ముగుస్తూండటం.. తమ స్థలాలకు డిమాండ్ లేకపోవడంతో..అమ్ముకోవడానికీ తంటాలు పడుతున్నారు. బైబ్యాక్ చేసేందుకు ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు ముందుకు రావడం లేదు.
ఇప్పుడు ఈ మోసాలు బయటపడటం ప్రాథమిక స్టేజ్‌లోనే ఉంది. వందల కోట్ల మోసాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బై బ్యాక్ ఆఫర్లు పేరుతో నమ్మిన కొన్ని వేల మంది మునిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీలాంచ్ ఆఫర్ల పేర్లతో మోసం చేసిన వారు కొన్ని వేల కోట్లు కొల్లగొట్టారు.