ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగా ఈలోగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసుకొనే పనిలో బిజీగా ఉన్నాడు. `స్పిరిట్`లో కథానాయికగా ఓ బాలీవుడ్ స్టార్ నటించబోతోందన్న వార్త ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది. ఆ కథానాయిక ఎవరన్నది స్పష్టత లేదు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ దీపికా పదుకొణెకి దక్కిందని సమాచారం.
‘కల్కి’లో దీపిక ఓ కీలక పాత్ర పోషించింది. అయితే… అది రెగ్యులర్ కథానాయిక పాత్ర అయితే కాదు. ఈసారి మాత్రం పర్ఫెక్ట్ హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేశారని సమాచారం. ఇటీవల సందీప్ రెడ్డి – దీపిక పదుకొణెల మధ్య చర్చలు కూడా సాగాయని, ఈ సినిమాలో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని దీపిక పేర్కొందని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు సందీప్. హీరోలు పోలీస్ పాత్రలు చేయడం రెగ్యులరే. కానీ సందీప్ రెడ్డి మాత్రం ఈ క్యారెక్టర్ని కొత్త పంథాలో డిజైన్ చేశారని, ఇలాంటి పోలీస్ క్యారెక్టర్ని ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ చూసి ఉండరని ఇన్ సైడ్ వర్గాలు ఊరిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమా సమాంతరంగా షూటింగ్ జరుపుకొంటోంది. ‘రాజాసాబ్’లో ప్రభాస్ వర్క్ పూర్తయిన తరవాత ‘స్పిరిట్’ మొదలయ్యే ఛాన్సుంది.