‘పుష్ప 2’కి ఇప్పటికే విపరీతమైన బజ్ ఉంది. ఈ సినిమా టీజర్ హిట్టు, ట్రైలర్ సూపర్ హిట్టు. పాటలన్నీ ఫ్యాన్స్ ని ఊపేస్తున్నాయి. ఈ బజ్ చూస్తుంటే తొలి రోజు బాక్సాఫీసు దగ్గర రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయం అనిపిస్తోంది. ఇంత బజ్ ఉన్న సినిమాకి ఇప్పుడు వైసీపీ కూడా ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడుతోంది. వైసీపీ నేత అంబటి రాంబాబు ‘పుష్ప 2’కి తన వంతుగా ప్రమోషన్లు, ఎలివేషన్లు ఇస్తున్నారు. పార్ట్ 1 అద్భుతంగా ఉందని, హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ చేశారని, పార్ట్ 2 కోసం అందరితో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా ప్రకటించారు. అంబటి రాంబాబు ఏమిటి? సినిమా ప్రమోషన్లు చేయడం ఏమిటి? కొంపదీసి ఆయన రాజకీయాల నుంచి సన్యాసం పుచ్చుకొని, సినిమాల్లో గానీ చేరిపోయారా? అనే అనుమానం అక్కర్లేద్దు. గత ఎన్నికల్లో వైసీపీకి పరోక్షంగా,ప్రత్యక్షంగా అల్లు అర్జున్ మద్దతు ఇచ్చాడు, నంధ్యాల వెళ్లి, ప్రచారం చేసి వచ్చాడు. అఫ్కోర్స్.. బన్నీ ప్రచారానికి వెళ్లిన చోట వైకాపా ఓడిపోయిందనుకోండి. అది వేరే విషయం. అప్పుడు వైసీపీకి బన్నీ సపోర్ట్ చేశాడు కాబట్టి, ఇప్పుడు బన్నీ సినిమాకు వైకాపా మద్దతు పలుకుతోంది. అదీ మేటరు.
పైగా బన్నీ సినిమాపై జనసేన కార్యకర్తలు కాస్త కచ్చతోనే ఉన్నారు. ఈసారి బన్నీ సినిమాకు సపోర్ట్ చేసేది లేదని పవన్ ఫ్యాన్స్ మొహం మీదే చెప్పేస్తున్నారు. జనసేన ఎడ్డెం అంటే తెడ్డెం అనడం వైకాపా పాలసీ కాబట్టి, వాళ్లు బన్నీకి సపోర్ట్ చేయడం లేదు కాబట్టి, వైకాపా వాళ్లు ఆ బాధ్యత నెత్తిమీద వేసుకొన్నారు. ఏ సినిమాను ఎవరూ ఆపలేరని, సినిమాలో విషయం ఉంటే, హిట్టయి తీరుతుందని అంబటి రాంబాబు సినీ విశ్లేషణలు చేస్తోంది అందుకే. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాల్ని తొక్కేయాలని చూశారని, అది కుదర్లేదని, ఇప్పుడు బన్నీ సినిమానీ ఎవరూ తొక్కేయలేరని… పక్కా సినిమా వాదిగా మాట్లాడుతున్నారు అంబటి. సినిమాపై ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉంటే… వైకాపా హయాంలో సినిమా పరిశ్రమని ఎందుకు పట్టించుకోలేదు? పుష్ప సినిమాకు ఎందుకు రేట్లు పెంచలేదు. హాలీవుడ్ ప్రమాణాలతో తీసిన సినిమా అని అంబటి వారికి ఇప్పుడు గుర్తొచ్చిందా? అంబటి రాంబాబు పుష్ప 2కి కొత్తగా బజ్ ఏం తీసుకు రావాల్సిన అవసరం లేదు. అది ఎంత కావాలో అంతకంటే ఎక్కువే ఉంది. అంబటి వల్ల… పుష్ప 2కి అదనంగా వచ్చేదేం ఉండదు. పైగా.. అంబటి సపోర్ట్ చేశాడంటే అది ప్రతికూల ప్రభావం తీసుకొచ్చే ప్రమాదం ఉంది. సినిమాపై పార్టీల నీడ పడడం ఎప్పుడూ మంచిది కాదు. ఈ విషయంలో పుష్ప టీమ్ కాస్త జాగ్రత్తగా ఉండాలి.