రియల్ ఎస్టేట్ మోసాలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఆర్జే వెంచర్స్ పేరుతో ఓ జంట చేసిన చీటింగ్‌తో కనీసం రెండు వందల కోట్లు నష్టపోయారు సామాన్యులు.. ప్రీలాంచ్ అంటూ ఆర్జే గ్రూప్ చైర్మన్ భాస్కర్, ఎండీ సుధారాణి సామాన్యుల్ని నట్టేట ముంచారు. నగర శివారులోని పలు ఏరియాల్లో అపార్ట్మెంట్స్, ఫామ్ ల్యాండ్స్ అంటూ ఆర్జే వెంచర్స్ ప్రకటనలు ఇచ్చింది.
సినీ, క్రీడా ప్రముఖుల చేత ప్రకటనలు ఇచ్చింది. 2020 నవంబర్‌లో ఆర్ హోమ్స్ చదరపు గజం రూ.2,199కే చెప్పింది. కొనుగోలుదారులను ఆకర్షించడానికి మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి వంటి ప్రముఖులతో ప్రకటనలు చేసి ప్రమోట్ చేసింది. చాలా మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ఫ్లాట్లను రిజర్వ్ చేసుకున్నారు. ఇలా2020 – 21 మధ్య వివిధ ప్రాజెక్టుల పేరుతో దాదాపు 600 మంది నుంచి 200 కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది.
ఆర్ హోమ్స్ ఛైర్మన్ భాస్కర్ గుప్తా, అతని భార్య సుధా రాణి కొనుగోలుదారులకు రెండు మూడు నెలల్లో అవసరమైన అన్ని అనుమతులను పొందుతారని, ప్రాజెక్ట్ 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. డబ్బులు వసూలు చేశారు. కానీ అసలు ప్రారంభించనే లేదు. డబ్బులు తిరిగి ఇస్తానంటూ కొంత మందికి చెక్కులు ఇచ్చారు. అయితే అవి బౌన్స్ అయ్యాయి. సిద్దిపేట, కర్ధనూర్ సహా పలు ప్రాంతాల్లో ఇదే విధంగా ఫామ్ ల్యాండ్ పేరుతో డబ్బులు వసులు చేసి మోసం చేసినట్లుగా తాజాగా గుర్తించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్జే గ్రూప్‌పై సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలోనే భాస్కర్, సుధారాణిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసుల్ని బతిమాలుకుంటున్నారు బాధితులు.