ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ రూ. 27 కోట్లతో జాక్ పాట్ కొట్టినా అందరూ రాజస్థాన్ రాయల్స్ జట్టు కోటి పది లక్షల రూపాయలకు తమ ఖాతాలో వేసుకున్న వైభవ్ సూర్యవంశీ అనే ఆటగాడి గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ సూర్యవంశీ వయసు పదమూడు ఏళ్లు మాత్రమే.
కాస్త పెద్దవాళ్లు గల్లీ క్రికెట్ ఆడుతున్నా పదమూడేళ్ల బాలుడు వస్తే కనీసం ఫీల్డింగ్ కు కూడా అనుమతించరు. దూరంగా ఉండి చూడమంటారు. అలాంటిది.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ పిల్లవాడిని.. తమ జట్టులోకి రూ. కోటి పది లక్షలు వెచ్చించి మరి తీసుకుంది. సూర్యవంశీలో రాజస్థాన్ వ్యూహకర్తలు ఏమి చూసి ఉంటారు ?
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ టాలెంట్ ను గుర్తించింది ఒక్క రాజస్థాన్ మాత్రమే కాదు ఇతర జట్లు కూడా. అందుకే బేస్ ప్రైస్ నుంచి కోటి పది లక్షలకు వైభవ్ సూర్యవంశీ వచ్చారు. ఇటీవల యూత్ టెస్టు జరిగినప్పుడు ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు సూర్యవంశీ.అండర19 టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియాపై జరిగినప్పుడు 58 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో పధ్నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు ఉన్నాయి. గత ఏడాదే రంజీల్లోనూ చోటు సంపాదించుకున్నాడు. ఏ టీములో ఆడినా గొప్పగా స్కోర్లు చేయడం సూర్యవంశీకి కామన్.
ఆ సమయంలోనే రాహుల్ ద్రావిడ్ దృష్టిని ఆకర్షించాడు. అద్భుతమైన ప్యూచర్ ఉన్న ఆటగాడిగా ద్రావిడ్ గుర్తించాడు. అవకాశాలు కల్పిస్తే భారత ఫ్యూచర్ కోహ్లీ అవుతాడని గుర్తించారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు రాజస్థాన్ జట్టులోకి వచ్చాడు. అతనికి వస్తున్న ఫోకస్ కి.. తుది జట్టులో కూడా చోటు ఖాయమే అనుకోవచ్చు.