నెపోటిజం అనుకొంటాం కానీ, వారసత్వం కొనసాగించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో అంచనాలు ఉంటాయి. ఓ స్టార్ కొడుక్కి ఎంట్రీ ఈజీగానే లభిస్తుంది. కానీ స్టార్ కొడుకు స్టార్ కావాలంటే… డక్కా ముక్కీలు తినాల్సిందే. తన ప్రయాణాన్ని జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ని చూస్తే అదే అనిపిస్తోంది. సచిన్ ఓ దిగ్గజం. క్రికెట్ రూపు రేఖల్ని మార్చేసిన మేటి ఆటగాడు. క్రికెట్ ని సచిన్‌కు ముందు, ఆ తరవాత అని విభజించి చూడొచ్చు. ఈ మాస్టర్‌కు అందని రికార్డు లేదు. అలాంటి సచిన్ టెండూల్కర్ వారసుడిగా అడుగు పెట్టిన అర్జున్ టెండూలర్క్ కెరీర్ నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది.
సచిన్‌లా అర్జున్ క్రికెట్ లో అద్భుతాలు చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుందని మాత్రం భావించారు. అర్జున్ మంచి హైట్. తన ఫిజిక్ ఫాస్ట్ బౌలింగ్ కి సరిగ్గా సరిపోతుంది. అది ఊహించిన సచిన్.. అర్జున్‌ని బౌలర్ గా తీర్చిదిద్దాలనుకొన్నాడు. కానీ అది సాధ్యం కావడం లేదు. తనపై ఉన్న ఒత్తిడిని అర్జున్ అధిగమించలేకపోతున్నాడు. రంజీల్లో అర్జున్ స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. ఐపీఎల్ లో కూడా తనకు పరాభవమే. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో.. అర్జున్ ని ఎవరూ కొనుక్కోలేదు. చివరికి మిగిలిపోయిన ఆటగాళ్లని మళ్లీ వేలం వేస్తే.. ముంబై జట్టు బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది. ముంబైనే ఎందుకంటే… సచిన్ ముంబై ఇండియన్స్ కి ఆడాడు. ఆ టీమ్ కి తాను బ్రాండ్ అంబాసిడర్. ఆ కన్సర్న్తో అర్జున్‌ని ముంబై కొనుగోలు చేయాల్సివచ్చింది. గతంలో కూడా అర్జున్ ని ముంబైనే తీసుకొంది. రెండు మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చింది. కానీ అర్జున్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఈసారి అర్జున్ రెండుసార్లు వేలంలో వచ్చినా ‘సచిన్ కొడుకే కదా, తీసుకొందాంలే’ అని ఒక్కరూ ధైర్యం చేయలేదు. చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ముంబై తీసుకోవాల్సివచ్చింది.
ఈ సీజన్లో కూడా ఒకట్రెండు మ్యాచ్‌లు అర్జున్ ఆడొచ్చు. ఆ రెండు మ్యాచ్‌లలో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి అర్జున్ కెరీర్ డిసైడ్ అవుతుంది. అవకాశం వచ్చిన అరాకొర మ్యాచ్‌లలో అర్జున్ అద్భుతాలు సృష్టిస్తాడని ముంబై కూడా అనుకోవడం లేదు. ముంబై తుది జట్టులో నిలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ పోటీ ఎక్కువ. కేవలం.. అదనపు ఆటగాడుగా మాత్రమే అర్జున్ కొనసాగే అవకాశం ఉంది. ఓ దిగ్గజం వారసుడు.. ఇలా ఎగస్ట్రా ప్లేయర్‌గా పరిమితమైపోవడం బాధాకరమే. అందుకే అనేది.. టాలెంట్ మాత్రమే శ్రీరామ రక్ష అని. అనామకుడ్ని సైతం సూపర్ స్టార్ చేసేది టాలెంటే. అదే లేకపోతే.. సచిన్ టెండూల్కర్ కొడుకైనా, ఇంకెవరైనా పెద్దగా తేడా ఉండదు.