ఏపీలో మూడు రాజ్యభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవన్నీ ఉపఎన్నికలే. కొంత మంది పదవులు వదులుకున్నారు.. మరికొంత మంది లోక్ సభ ఎంపీలుగా ఎన్నికయి రాజీనామాలు చేశారు. ఏపీ నుంచి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. వీరందరూ వైసీపీకి చెందిన వారు.
ఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మూడు స్థానాలు ఏకగ్రీవం అవడం ఖాయమే. ఎందుకంటే వైసీపీకి ఒక్క స్థానంలో పోటీ చేసే బలం కూడా లేదు. అందుకే మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయో అన్న సస్పెన్స్ కూటమిలో ఉంది. జనసేన పార్టీ నుంచి నాగబాబుకు అవకాశం కల్పించవచ్చని చెబుతున్నారు. ఇక రెండు స్థానాలకు టీడీపీ సభ్యులకు దక్కే అవకాశం ఉంది.
దేవినేని ఉమ, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడుతో పాటు మరికొంత మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. చంద్రబాబు మనసులో ఏముందో స్పష్టత లేదు. ఈ మూడు పదవులు పూర్తి స్థాయి పదవి కాలం ఉన్నవి కావు. రాజీనామా చేసిన వారు మళ్లీ పదవులకు ఎంపికయ్యే అవకాశాలు లేవు. మోపిదేవి టీడీపీలో చేరారు కానీ..తనకు ఢిల్లీకి వెళ్లే ఆసక్తి లేదని చెప్పారు. బీద మస్తాన్ రావు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఆర్ కృష్ణయ్య కూడా అంతే. డిసెంబర్ పదో తేదీ వరకూ టైం ఉంది కాబట్టి చంద్రబాబు ఎనిమిది, తొమ్మిదో తేదీల్లో పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.