ఏపీలో భర్తీ కావాల్సిన మూడు రాజ్యసభ సీట్ల విషయంలో జనసేన , బీజేపీ పార్టీలకు ఓ సీటు కేటాయించి.. మిగిలిన రెండు సీట్లు టీడీపీ తీసుకోనుంది. కృష్ణయ్య రాజీనామా బీజేపీ ఒప్పందం ప్రకారం జరిగినందున ఆయన కోటాలో బీజేపీకి సీటు కేటాయించక తప్పని చెబుతున్నారు. ఓ కేంద్ర మంత్రిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపనున్నట్లుగా చెబుతున్నారు.
మిగిలిన రెండు సీట్లలో ఇద్దరు రాజ్యసభ సభ్యుడు టీడీపీతో ఒప్పందం ప్రకారం రాజీనామా చేశారు. అందుకే ఈ సారి జనసేన పార్టీకి చాన్స్ లేదని కూటమి వర్గాలు చెబుతున్నాయి. మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామాలు చేశారు. మోపిదేవికి పదవి కాలం ఇంకా రెండేళ్లే ఉంది. తనకు రాజ్యసభపై ఆసక్తి లేదని ఆయన తేల్చేశారు. బీద మస్తాన్ రావుకు మళ్లీ టీడీపీ తరపున సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఆయన పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉంటుంది. బీద కూడా సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు మరోసారి టీడీపీ తరపున రాజ్యసభకు వెళ్తున్నారు.
మరో ఒక్క సీటు కోసమే పోటీ కనిపిస్తోంది. చంద్రబాబు ఆ సీటును ఎవరికి ఇస్తారన్నది సస్పెన్స్ గా మారింది. రెండేళ్ల పదవీ కాలమే ఉన్నప్పటికీ .. ఇప్పుడు చాన్స్ వస్తే తర్వాత పొడిగింపు కూడా వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే సీనియర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దేవినేని ఉమ, అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్, యనమల రామకృష్ణుడు సహాచాలా పేర్లు వినిపిస్తున్నాయి.