కియా తర్వాత అనంతపురం జిల్లాకు మరో కీలకమైన పెట్టుబడి వస్తోంది. ఆయుధాల తయారీలో ప్రసిద్ధమైన కంపెనీ భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ రూ. 2400 కోట్ల భారీ పెట్టుబడితో పరిశ్రమను పెట్టేందుకు సిద్దమయింది. ఆయుధాలతో పాటు వివిధ రకాల పరిశ్రమలకు అవసరమైన సామాగ్రిని తయారు చేయడంలో భారత్ ఫోర్జ్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సత్యసాయి జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఆ పరిశ్రమ యాజమాన్యం పరిశీలించింది.
ఎక్కువగా ఎగుమతి అవసరాల కోసం ఈ ప్లాంట్ ను నిర్మించబోతున్నారు. ప్రభుత్వానికి ఈ సంస్థ స్పష్టమైన ప్రణాళిక అందించింది. వచ్చే ఏడాది కల్లా షెల్ ఫిల్లింగ్ యూనిట్, ఆ తర్వాత గన ప్రొపెల్లంట్ తయారీ యూనిట్, ఆ తర్వాత ఎనర్జిటిక్స్, అడ్వాన్సుడు ఎనర్జిటిక్ ఉత్పత్తులను భయారు చేయనున్నారు. ఇవన్నీ రక్షణ రంగానికి సంబంధించినవే. యుద్ధాల్లో వాడేవే. ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతులు చేయనున్నారు.
ప్రపంచ ఆయుధ మార్కెట్లో మందుగుండు సామాగ్రికి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో భారత్ ఫోర్జ్ ఈ అంశంలో మార్కెట్ లీడర్ గా ఉంది. ఈ పెట్టుబడి వల్ల అనంతపురం జిల్లా పారిశ్రామికీకరణలో మరింత ముందడుగు పడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి.