నాలుగేళ్ల నుంచి ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసే వారిని నిండా ముంచుతున్న ప్రిలాంచ్, బై బ్యాక్ ఆఫర్ల విషయంలో తెలంగాణ రెరా కీలక ప్రకటన చేసింది. అసలు ప్రాజెక్టే లేకుండా అమ్మకాలు చేయడం, మళ్లీ కొంటామని ఆఫర్లు ఇవ్వడం ఖచ్చితంగా మోసమేనని అలాంటి వాటిని నమ్మవద్దని తాజాగా ప్రకటన జారీ చేసింది.
దాదాపుగా ప్రతి రోజూ ఏదోక ప్రీలాంచ్ మోసం బయటపడుతోంది. సాహితి ఇన్ ఫ్రా చైర్మన్ బూదాటి లక్ష్మి నారాయణ పదిహేను వందల కోట్ల వరకూ ముంచారు. ఇందులో ఆయన పెద్దగా కనిపిస్తున్నారు.. ఇతర చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందినంత దండుకున్నారు. రెండు వేలుకు..మూడు వేలకు ఎస్ఎఫ్టీల చొప్పున కట్టిస్తామని చెప్పి నమ్మిన వారందర్నీ నట్టేట ముంచారు. ఇలా ప్రజలు కొన్నివేల కోట్లు కోల్పోయిన తర్వాత రెరా స్పందించింది. అవన్నీ మోసాలేనని చెబుతోంది.
రెరా అనుమతి లేని సంస్థల నుంచి అసలు కొనుగోళ్లు చేయొద్దన్న సూచనలు ఉన్నాయి. కానీ ప్రతి సంస్థ అనుమతి తీసుకోవడం వల్ల రేట్లు పెరుగుతాయని.. అవి లేకపోతేనే తక్కువకు వస్తాయని చెప్పి మభ్యపెట్టి మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి బారిన పడకుండా చైతన్యవంతం చేయాల్సిన రెరా వంటి సంస్థలు .. అంతా మోసపోయినాక .. అవి మోసాలని చెబుతున్నారు.
రెరా వద్ద రిజిస్టర్ అయిన కంపెనీలు కూడా మోసాలు చేస్తున్నాయని వస్తున్న ఆరోపణలపై రెరా స్పందించడం లేదు. అయితే మోసపోయి న్యాయపోరాటం చేసే బదులు.. కాస్త విచక్షణతో ఇళ్లు , స్థలాలు కొనుగోలు చేసుకోవడం మంచిదన్న సలహాలు నిపుణుల నుంచి వస్తున్నాయి.