జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడురోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం తర్వాత ఢిల్లీలో ఆయన పలుకుబడి మరింత పెరిగింది. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీలు ఉత్సాహంగా సాగాయి. అందరూ ఆత్మీయ స్వాగతం పలికి తీసుకు వచ్చిన వినతి పత్రాలమేరకు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీతో దాదాపుగా అరగంట సేపు సమావేశం కావడం ఢిల్లీ మీడియా వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతూండటంతో పార్లమెంట్ భవనంలోనే ప్రధాని చాంబర్లోే పవన్ భేటీ అయ్యారు. మాములుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని ఇతరుల్ని కలిసినా .. ఓ పది నిమిషాలు మాట్లాడితే గొప్ప అన్నట్లుగా ఉంటుంది. కానీ పవన్ తో అరగంటసేపు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు.. తన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో గత ప్రభుత్వ అవినీతి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపైనా పవన్ చర్చించినట్లుగా చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా బయటపడుతున్న అవినీతితో పాటు తాజాగా జగన్ రూ. 1750 కోట్లు అదానీ దగ్గర లంచం తీసుకున్నట్లుగా అమెరికా కోర్టులో బయటపడిన అంశంపైనా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎలా ముందుకెళ్లాలో మీరే చెప్పాలని సలహా అడిగినట్లుగా తెలుస్తోంది.
ప్రధాని మోదీ ఎప్పుడు పవన్ కలిసినా ఆప్యాయంగా మాట్లాడతారు. డిప్యూటీ సీఎం హోదాలో అధికారిక పర్యటన మీద మొదటి సారి కలిశారు. మోదీ ఎప్పట్లాగే తన ఆప్యాయత కూడా చూపారు.