డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా ఆటగాడే కావొచ్చు. కానీ… హైదరాబాదీలకు తనంటే ప్రత్యేకమైన అభిమానం. సన్ రైజర్స్ తరపున ఆడి, చాలాసార్లు జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అంతేనా..? ‘పుష్ప’లో అల్లు అర్జున్ని ఇమిటేట్ చేసి, మరింత దగ్గరయ్యాడు. ఓ అంతర్జాతీయ ఆటగాడు, స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ, ఓ తెలుగు హీరోని ఇమిటేట్ చేయడం అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. ఆ తరవాత అందరూ డేవిడ్ ని ఫాలో అయ్యారు. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినప్పుడల్లా ఆ పాటలకు డాన్సులు వేస్తూ వార్నర్ రీల్స్ చేసేశాడు. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. ఓ దశలో ‘పుష్ప 2’లో వార్నర్ నటిస్తాడన్న వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా నితిన్ సినిమా ‘రాబిన్ వుడ్లో’ ఛాన్స్ దక్కించుకొన్నాడు. ఈ సినిమాలో అతిథిగా ఇలా మెరిసి, అలా మాయమయ్యే పాత్ర దక్కించుకొన్నాడు. లండన్ లో ఈ సినిమా షూటింగ్ కోసం 3 రోజులు పాల్గొన్నాడు వార్నర్.
అయితే వార్నర్ కనిపించేది కాసేపే అయినా, ఈ సినిమాలో కథ మలుపు తిరగడానికి ఈ పాత్ర కారణం అవుతుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. అందుకే ఈ పాత్రకు సంబంధించిన విషయాల్ని చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈరోజు హైదరాబాద్లో ‘రాబిన్వుడ్’ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ప్రెస్ ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించి చిత్రబృందానికి ఓ ప్రశ్న కూడా ఎదురైంది. కానీ దర్శకుడు వెంకీ కుడుముల నేరుగా సమాధానం చెప్పలేదు. ‘వార్నర్ పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పదలచుకోలేదు’ అంటూ జవాబు దాటేశారు. ఓ తెలుగు సినిమా కోసం అంతర్జాతీయ ఆటగాడ్ని తీసుకురావడం, కథని మలుపు తిప్పే పాత్ర అప్పగించడం నిజంగా థ్రిల్లింగ్ అంశమే. పుష్ప ప్రమోషన్లకు ప్లస్ అయిన వార్నర్ ని ‘రాబిన్ వుడ్’ కోసం కూడా వాడేయాలని మైత్రీ భావిస్తోంది. తనతో రీల్సే చేయిస్తారో, లేదంటే.. హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ ని తీసుకొని వస్తారో.. ఏదోలా వార్నర్ ఈసారి నితిన్ సినిమా కోసం బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.