జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదవి చేపట్టిన తర్వాత తీరికగా మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీతో సహా కీలక నేతలందర్నీ కలిశారు. కూటమి ఎంపీలకు విందు కూడా ఇచ్చారు. అందరూ వచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం.. ఆ తర్వాత బీజేపీ పెద్దల వద్ద వచ్చిన గుర్తింపుతో పవన్ కల్యాణ్ పలుకుబడి మరింత పెరిగింది. ఈ పర్యటనతో కేంద్రమంత్రుల్ని కూడా పలకరించి.. రాష్ట్రం కోసం నిధులు అడిగారు.
పనిలో పనిగా తన సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు కోసం లైన్ క్లియర్ చేసుకునేందుకు పవన్ ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం వల్ల ఏర్పడిన ఖాళీలు మూడు భర్తీ చేయడానికి షెడ్యూల్ వచ్చింది. ఒకటి రెండేళ్లు, మిగిలిన రెండింటికి నాలుగేళ్ల గడువు ఉంది. ఇందులో ఒకటి నాగబాబుకు ఇప్పించాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. మామూలుగా ఏర్పడే ఖాళీల్లో అయితే జనసేనకు ఒకటి వచ్చేది. కానీ ఇవి రాజీనామాల వల్ల వచ్చిన ఖాళీలు.
బీజేపీతో ఒప్పందం మేరకు కృష్ణయ్య రాజీనామా చేశారని అంటున్నారు. బీజేపీ దృష్టిలో ఎవరో ఉండే ఉంటారని చెబుతున్నారు. ఇక మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరుతున్నారు. వారిలో బీదకు ఆయన పదవి ఆయనకు ఇస్తారు. మోపిదేవి వద్దంటున్నారు కాబట్టి టీడీపీ నుంచి ఒక్కరికి చాన్స్ ఉందని అనుకోవచ్చు. ఇక నాగబాబుకు అవకాశం దక్కడం కష్టమేనని అంటున్నారు. అయితే పవన్ గట్టిగా ప్రయత్నించి వచ్చారని.. ఏం జరుగుతుందో చూడాలని జనసేన వర్గాలు అనుకుంటున్నాయి.