రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలన్నా.. మధ్యతరగతి అందరికీ ఇళ్లు ఉండేలా చూసేలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలన్నా ఓ మంచి ఆప్షన్ ను క్రెడాయ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మధ్య ఆదాయ వర్గాలు ఇళ్లు కొనేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై 100 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా కోరుతోంది.
అంతే కాదు పరిమితి కూడా పెంచాలని క్రెడాయ్ సూచిస్తోంది. 45 లక్షల రూపాయల వరకు ఖరీదైన ఇళ్లను అందుబాటు ధరల గృహాలుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ఈ పరిమితిని కనీసం 75-80 లక్షల రూపాయల వరకు పెంచాలని క్రెడాయ్ ప్రతిపాదించింది. అందుబాటు ధరల, మధ్య ఆదాయ గృహాలకు గిరాకీ పెంచేందుకు, రూ. 75-80 లక్షల ధరతో నిర్మాణంలో ఉన్న ఇళ్లపై GST రేటును 1 శాతానికి పరిమితం చేయాలని అంటున్నారు.
నిర్మాణంలో ఉండి & రూ. 45 లక్షల వరకు ధర ఉన్న అఫర్డబుల్ హౌస్లపై 1 శాతం GST రేటు అమలు చేస్తున్నారు. రూ. 45 లక్షల కంటే కంటే ఎక్కువ రేటు ఉన్న ఇళ్లకు 5 శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అఫర్డబుల్ హౌసింగ్ పరిమితిని రూ. 75-80 లక్షలకు పెంచాలన్నది ఇండస్ట్రీవర్గాలవాదన.
ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండాలంటే పన్నులు తగ్గాలని… గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ప్రస్తుతమున్న రూ. 2 లక్షల మినహాయింపు పరిమితి స్థానంలో పూర్తిగా 100 శాతం తగ్గింపు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుంచి వస్తున్నాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీపై మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉంది. కేంద్రం ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటే మధ్యతరగతి వర్గాలు మరింతగా ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.