Roti Kapda Romance movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
యూత్ ఫుల్ స్టోరీని అర్థమయ్యేలా, అర్థవంతంగా తీర్చిదిద్దడం కూడా ఓ కళే. అది అందరికీ అబ్బదు. యువత జీవితంలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రేమ, స్నేహం, కెరీర్, లైఫ్‌లో సెటిల్మెంట్… ఇలా చాలా గందరగోళాలతో గజిబిజిగా ఉంటుంది. ఇవన్నీ కనెక్ట్ చేసుకొంటూ ఓ అందమైన కథ చెప్పగలగాలి. ఆ ఫార్ములా పట్టుకోవడమే కష్టం. ఒకసారి పట్టుకొంటే మాత్రం తిరుగుండదు. హ్యాపీడేస్ లో స్టార్లు ఎవరూ లేరు. ఆ సినిమానే వాళ్లందరినీ స్టార్లుగా మార్చింది. యూత్ ఫుల్ కథల్లో ఉన్న మజానే అది. ఒక్కసారి క్లిక్ అయితే.. ఆ సినిమాతో చాలామంది స్టార్లు పుట్టుకొస్తారు. ‘రోటీ – కపడా – రొమాన్స్’ సినిమా కూడా యూత్ ఫుల్ స్టోరీనే. ఇందులోనూ స్టార్లు లేరు. వీళ్లు యూత్ పల్స్ పట్టుకోగలిగారా? వాళ్లకు నచ్చే కంటెంట్ ఈ సినిమాతో ఇవ్వగలిగారా?
ఇది నలుగురు యువకుల కథ. హర్ష (హర్ష నర్రా), రాహుల్ (సందీప్ సరోజ్), సూర్య (తరుణ్), విక్కీ (సుప్రజ్) ఈ నలుగురూ స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటారు. హర్ష ఓ ఈవెంట్ ఆర్గనైజర్. రాహుల్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. సూర్య ఓ ఆర్జే. విక్కీ అయితే… ఈ ముగ్గురుపై ఆధారపడి బతికేస్తుంటాడు. హాయిగా సాగిపోతున్న ఈ నలుగురి జీవితాల్లోనూ అమ్మాయిలూ, ప్రేమ అనే కొత్త విషయాలు ప్రవేశిస్తాయి. సూర్యని దివ్య (నువేక్ష) ఇష్టపడుతుంది. కానీ దివ్య మనస్తత్వం పూర్తిగా వేరు. తనకు స్వాతంత్య్ర భావాలు ఎక్కువ. అది ఇద్దరి మధ్య ఈగోలకు దారి తీస్తుంది. హర్షది మరో కథ. సోనియా (కుష్బూ చౌదరి) అనే అమ్మాయి తనకు ఫిజికల్ గా హెల్ప్ చేయమని ప్రాధేయపడుతుంటుంది. ప్రేమ లేకుండా ఫిజికల్ గా కలవడం ఎలా? అనేది హర్ష సందేహం. రాహుల్ ప్రియ (ఠాకూర్)ని ఇష్టపడతాడు. ప్రియ కూడా రాహుల్ ని ప్రేమిస్తుంది. కానీ.. తన ప్రేమ గోల వేరు. రాహుల్ లైఫ్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. ప్రియకు అంత టైమ్ ఉండదు. పెళ్లి చేసుకొంటేనే ప్రేమ అనే కండీషన్ పెడుతుంది. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్న విక్కీ.. ఉద్యోగం అంటే పిచ్చి ప్రేమ ఉన్న శ్వేత (లేఖ)ని ఇష్టపడతాడు. శ్వేత ఏమో.. విక్కీని తెగ వాడుకొంటుంటుంది. ఈ నాలుగు ప్రేమకథలు చివరికి ఏమయ్యాయి? ఎవరి ప్రేమ ప్రేమ గెలిచింది? ఎవర్ని ప్రేమ గెలిపించింది? అనేది తెరపై చూడాలి.
ఓ ప్రేమకథని అందంగా, అర్థవంతంగా చెప్పడమే కష్టం. అలాంటిది.. నాలుగు ప్రేమకథల్ని ఒకేసారి చెప్పడం ఎంత రిస్కీ టాస్కో ఊహించండి. అయితే తొలి సినిమా చేస్తున్న విక్రమ్ రెడ్డి ఈ టాస్క్ ని కాస్త సులభంగానే దాటేశాడనిపిస్తుంది. నలుగురు స్నేహితులు ఫస్ట్రేషన్‌తో గోవా వెళ్లడంతో ఈ కథ మొదలవుతుంది. గోవాలో యూత్ ట్రిప్ అనగానే ‘ఈనగరానికి ఏమైంది’లాంటి సినిమా ఏమైనా చూడబోతున్నామా? అనే అనుమానం కలుగుతుంది. వెంటనే ఫస్ట్రేషన్ బోయ్స్ తమ గతాన్ని తవ్వుకోవడం ఒకరి తరవాత మరొకరి లవ్ స్టోరీని రివీల్ చేయడంతో… అసలు కథ మొదలవుతుంది. వాళ్ల ఫస్ట్రేషన్ వెనుక ఉన్న కారణాలు తెలుస్తుంటాయి. నాలుగు ప్రేమకథలు మరీ కొత్తగా ఉండవు కానీ, బోరింగ్ గా మాత్రం అనిపించవు. హర్ష – సోనియా ట్రాక్ కాస్త యూత్ ఫుల్ గా నడుస్తుంది. ఈ జంట కథలో రొమాన్స్ కు పెద్ద పీట వేశారు. విక్కీ – శ్వేత లవ్ స్టోరీలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది. సూర్య – దివ్య ట్రాక్ కాస్త రొటీన్‌గా ఉంటుంది. ప్రేమలో పడినప్పుడు బాగానే ఉంటుంది, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలెట్టాక, ఒకరిలో ఉన్న లోపాలు మరొకరికి అర్థమవుతాయి అనే పాయింట్ చుట్టూ ఈ ట్రాక్ నడిచింది. రాహుల్ -ప్రియ ప్రేమకథ అస్సలు అర్థం కాదు. రాహుల్ కు ప్రియ అంటే ఇష్టమే. కానీ వెంటనే పెళ్లి చేసుకోడట. టైమ్ కావాలట. ఈ కాన్ఫ్లిక్ట్ ఏమాత్రం అతకలేదు. ఇంట్రవెల్ బ్యాంగ్ పడేసరికే ఈ నాలుగు లవ్ స్టోరీలూ బ్రేకప్ వరకూ వెళ్లిపోతాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఓ బూతు పదంతో వేసే ధైర్యం చేశాడు దర్శకుడు. నాలుగు ప్రేమకథలూ… ఆ బూతు పదంతో ఎండ్ అవుతాయి కాబట్టి – సింబాలిక్ గా అలాంటి ఇంట్రవెల్ కార్డు వేశాడేమో కానీ, ఇలాంటి బూతులు వచ్చేటప్పుడు థియేటర్లో కూర్చున్న కుటుంబ ప్రేక్షకుల పరిస్థితి ఏమిటన్నది దర్శకుడు కాస్త ఆలోచించుకోవాల్సింది. యూత్ ఫుల్ సినిమాకాబట్టి, కేవలం యువతరమే థియేటర్లకు వస్తుంది అనుకోవడం పొరపాటు.
సెకండాఫ్ లో ఎమోషన్ కి పెద్ద పీట వేశాడు దర్శకుడు. కొన్ని డైలాగులు, సీన్లు… యువతకు ముఖ్యంగా అబ్బాయిలకు బాగా నచ్చేస్తాయి. ‘దేవుడు మీలా (అమ్మాయిలు) మాకు కమర్షియల్ గుండెలు ఇవ్వలేదు’ అనే డైలాగులో చాలా డెప్త్ ఉంది. ఆ సీన్… యువతను బాగా కదిలిస్తుంది. ట్రూ లవ్ లోని బాధ, అమ్మాయిలు హ్యాండిస్తే అబ్బాయిలు పడే ఆవేదన అర్ధమవుతాయి. ఈ నాలుగు ప్రేమకథల్ని ముగించిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. హ్యాపీ ఎండింగ్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ… విషాదకరమైన ముగింపులూ ఉండవు. ఓరకమైన ఆత్మ సంతృప్తి ఇచ్చేలానే కథలకు పుల్ స్టాప్ పెట్టాడు. ఈ సినిమా చివర్లో ఓ డైలాగ్ ఉంది. మన జీవితంలోకి చాలామంది వస్తారు. ఆనందాన్ని, బాధని పంచి వెళ్లారు. నువ్వు ఏది గుర్తు పెట్టుకొన్నావ్ అనేదాన్ని బట్టి వాళ్లతో నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఆనందాల్ని గుర్తు పెట్టుకొంటే పాజిటీవ్‌గా బతకొచ్చు. బాధని గుర్తు పెట్టుకొంటే శత్రువులుగా మిగిలిపోతారు అనే మాట ఈ కథకు, ఈ సినిమాకు మకుటం లాంటిది. బహుశా.. ఈ పాయింటే దర్శకుడ్ని ఈ కథ రాసేలా ప్రేరేపించి ఉండొచ్చు.
నలుగురు హీరోలూ డీసెంట్ గా తమ పాత్రల్ని చేసుకొంటూ వెళ్లిపోయారు. లోపాలు ఎంచేలా ఎవరి నటనా లేదు. అందరికంటే ఎక్కువ మార్కులు సుప్రజ్కి పడతాయి. తన పాత్రలో చాలామంది కుర్రాళ్లు ఐడెంటిఫై అవుతారు. తెరపై నలుగురు హీరోలున్నా, ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే వాళ్లని ఇష్టపడతారు ప్రేక్షకులు. ఆ కోటాలో చూసినా సుప్రజ్ గుర్తిండిపోతాడు. సూర్యగా కనిపించిన తరుణ్‌లో మంచి ఈజ్ ఉంది. తెలంగాణ స్లాంగ్ తనకు బాగా కుదిరింది. ఈ నలుగురు హీరోలకూ ఇక మీదటా అవకాశాలు వస్తాయి. అమ్మాయిల్లో లేఖ పద్ధతిగా కనిపించింది. సోనియా లాంటి పాత్ర ఒప్పుకోవడం చాలా కష్టం. ఈ పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుంది. కాకపోతే.. బోల్డ్ గా ఉన్నా, ఎక్కడా అతిగా అనిపించలేదు.
ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. ఏ పాట క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. అమ్మాయిల మనస్తత్వాల్ని ఎండగడుతూ సాగే ‘గలీజ్’ పాట కుర్రాళ్లకు ఎక్కుతుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. చిన్న సినిమా అనే ఫీలింగ్ తీసుకురాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని మూమెంట్స్ రిపీట్ గా చూస్తున్నట్టు అనిపించింది. దర్శకుడిలో విషయం ఉంది. ఓ రెగ్యులర్ కథనే కాస్త కొత్ర పేట్రన్‌లో చెబుతూ, క్లైమాక్స్ కి వచ్చేసరికి తనదైన టచ్ ఇవ్వగలిగాడు. థియేటర్లో యూత్ ఫుల్ సినిమా చూసి చాలా కాలం అయ్యింది. కుర్రాళ్లకు నచ్చే కంటెంట్ తో వచ్చిన సినిమా ఇది. వాళ్ల ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్