డిటెక్టీవ్ కథలంటే ఓరకమైన ఇష్టం ఉంటుంది అందరికీ. అయితే తెరపై ఈ కథల్ని చెప్పడం కూడా కష్టమే. చంటబ్బాయ్ లా తెలివితేటల్ని, కామెడీని మిక్స్ చేయగలగాలి. ఈమధ్య `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` వచ్చి హిట్ కొట్టింది. ఆ తరవాత ఈ తరహా కథల్ని ట్రై చేయడం ఇంకాస్త ఎక్కువైంది. ఇప్పుడు వెన్నెల కిషోర్ కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అంటూ. ‘చంటబ్బాయ్ తాలుకా’ అనేది ఉపశీర్షిక. మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయికగా నటించింది. టీజర్ ఈరోజు విడుదల చేసింది.
శ్రీకాకుళంలో.. ఓ మర్డర్ కేసు. పోలీసులకు కూడా అంతుచిక్కని రహస్యాల్ని ఓ లోకల్ గూఢచారి ఎలా ఛేదించాడన్నదే కథ. టైటిల్ కు తగ్గట్టుగా సినిమాలో ఎక్కువ డైలాగులు శ్రీకాకుళం యాసలోనే సాగుతాయి. దాన్ని వెన్నెల కిషోర్ తనదైన టిపికల్ స్టైల్ లో చెప్పడం బాగుంది. ”అవుట్ లుక్ చూసి కాదు సార్.. అవుట్ పుట్ చూసి ఇవ్వండి. ఛాన్సిస్తేనే కదా చిరంజీవి మ్యాచో మెగాస్టార్ అయ్యారు”, ”ఈ క్రైమ్‌లో పాత్రధారి, సూత్రధారి, కపటధారితో పాటు ఓ మాయదారి కూడా ఉన్నాడు” అనే డైలాగులు టీజర్లో వినిపించాయి. వెన్నెల కిషోర్ టైమింగ్, తనకున్న ఇమేజ్ ఈ సినిమాకు బలం. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.