ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వివాదానికి కారణం అయిన ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కుటుంబంతో బంధుత్వం ఉన్నవారిదేనని తేలింది. తలసాని కుమారుడు డైరక్టర్గా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే తమకు సంబంధం లేదని తలసాని ప్రకటించారు. తాజాగా ఆ ఫ్యాక్టరీ తమదేనని టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. అది తన కుమారుడు పుట్టా మహేష్ పెట్టిన కంపెనీ అని ప్రకటించారు. ప్రస్తుతం పుట్టా మహేష్ ఏలూరు టీడీపీ ఎంపీగా ఉన్నారు.
ఇథనాల్ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అని.. పూర్తి అనుమతులతో ఈ కంపెనీని నిర్మిస్తున్నామని పుట్టా సుధాకర్ ప్రకటించారు. పరిశ్రమలపై కుట్రలు చేయడం సరి కాదని.. పెట్టుబడులు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. రాజకీయాల్లో భాగంగానే ఇథనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రజల్ని రెచ్చగొట్టి ఆందోళనలకు కారణం అవుతున్నారని అంటున్నారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడింది. అనుమతులు పూర్తిగా కేసీఆర్ర హయాంలోనే ఇచ్చారని ఇప్పుడు తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. అసలు ఈ ఇథనాల్ కంపెనీకి సంబంధించిన మొత్తం వివరాలు శుక్రవారం బయటపెడతామన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇథనాల్ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామని పనులు ఆపేయాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది.