ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్టుమెంట్లో కొత్తగా ఈగల్ అనే శాఖను ఏర్పాటుచేశారు. దీని పని గంజాయి, డ్రగ్స్ నియంత్రించడం. వాటితో వ్యాపారం చేసే వారి సంగతి తేల్చడం.గంజాయి సాగును అరికట్టడం. ఈ ఈగల్ డిపార్టుమెంట్‌కు చీఫ్‌గా సీనియర్ ఐపీఎల్ ఆకే రవికృష్ణకు అవకాశం ఇచ్చారు. అందుకే ఈగల్ సంచలనం సృష్టించబోతోందని అందరికీ ఓ నమ్మకం ఏర్పడింది.
ఆకే రవికృష్ణ పోలీసింగ్ ఎంత కఠినంగా ఉంటుందో అంత మానవతా కోణంలో ఉంటుంది. ఆయన పని చేసిన చోటల్లా తనదైన ముద్ర వేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయినా.. గిరిజన ప్రాంతాల్లో అయినా.. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో అయినా మానవీయ కోణంలో పని చేస్తారు. మాటలతో పని అయితే .. చట్టాలను అతిక్రమించే వారిని అలాగేదారిలో పెడతారు. వారు జీవితాలను బాగు చేసుకునేందుకు అవసరమైన సాయం చేస్తారు. లేదంటే పోలీసింగ్ చేస్తారు. అక్కడి వరకూ పరిస్థితి వెళ్లిందంటే తట్టుకునే పరిస్థితి ఉండదు.
ఏపీలో గత పదేళ్ల కాలంలో గంజాయి వ్యాపారం పాతుకుపోయింది. దాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటే చిన్న పని కాదు. అందుకే దానికి ఆకే రవికృష్ణ సమర్థుడని చంద్రబాబు భావించారు. ఈ మేరకు ఈగల్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఆషామాషీ ఏర్పాటు కాదు. పెద్ద ఎత్తున సిబ్బంది.. పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఏపీలో గంజాయి వ్యాపారస్తులకు.. పెంపకం దారులకు అసలు సినిమా చూపించేందుకు రంగం సిద్ధమయింది.