మహారాష్ట్రలో బీజేపీ హైకమాండ్ కొత్త ప్లాన్లతో ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి కాదు అన్న ప్రశ్నే మొదటి నుంచి లేదు. చివరికి నిన్నటి వరకూ సీఎంగా ఉన్న షిండేనే.. నాకు వద్దు అనే ప్రకటన చేశారు. ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రశ్న.. ఫడ్నవీస్‌ను కూడా పక్కకు తప్పించడం. అదే మిషన్ ప్రారంభించిది. అందుకే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోంది. బీజేపీ పెద్దలు మహారాష్ట్రలో బ్రాహ్మణ ముఖ్యమంత్రిని కాకుండా ఓబీసీ లేదా మరాఠా నేతను ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటోంది.
ఫడ్నవీస్ అనూహ్యంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్ర బీజేపీకి కీలక నేతగా ఉన్న గోపీనాథ్ ముండే ఢిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. దాంతో నాయకత్వం ఫడ్నవీస్‌కు లభించింది. అనూహ్యంగా అందరూ ఉపముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి అవుతారు.. కానీ ఫడ్నవీస్ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు మరోసారి సీఎం ఖాయమని అనుకుంటున్నారు కానీ.. మోదీ, షాలు మరో రకంగా ఆలోచిస్తున్నారని క్లారిటీ వస్తోంది.
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేసే విధానాన్ని భిన్నంగా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ కు శివరాజ్ సింగ్ కాకుండా పెద్దగా పేరు లేని బీసీ నేతను సీఎంను చేశారు. రాజస్తాన్ లోనూ అంతే. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ కులగణన పేరుతో ఓబీసీల్లో చీలిక తెచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూండటంతో.. మహారాష్ట్రలో ఏబీసీ లేదా మరాఠాలకు చాన్సివ్వాలని అనుకుంటున్నారు. దీంతో ఫడ్నవీస్ ఈ సారి మంత్రి పదవికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.