కాకినాడ బియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించేందుకు పవన్ కల్యాణ్‌తో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రయత్నిస్తున్నారు. ఇదే లక్ష్యంతో సముద్రంలో కూడా వేట సాగిస్తున్నారు. రెండు రోజుల కిందట సముద్రంలోకి స్మగ్లింగ్ చేస్తూ పంపేసిన ఓడను చేజింగ్ చేసి మరీ పట్టుకొచ్చారు కాకినాడ కలెక్టర్. పూర్తి స్థాయి నిఘా పెట్టినా అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతుందోనని తేల్చేందుకు స్వయంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.
బియ్యం స్మగ్లింగ్ అంటే… ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చెబుతారు అందరూ. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన చేసిన బియ్యం దందా.. ఆఫ్రికా దేశాలన్నింటికీ పాకిందని అంటారు. రేషన్ బియ్యాన్ని కేజీ పది రూపాయలకు ..బలవంతంగా కొనడం.. వాటిని స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొన్ని వేల కోట్ల విలువైన బియ్యాన్ని తరలించి ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. పోర్టు మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నది ద్వారంపూడేనని కాకినాడ మొత్తం చెబుతారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దందాపై ప్రధానంగా దృష్టి పెట్టారు నాదెండ్ల మనోహర్. కాకినాడలోనే ఉండి మొత్తం స్మగ్లింగ్ వ్యవహారాలను కంట్రోల్ చేశారు. అయితే లూప్ హోల్స్ పట్టుకుని మళ్లీ తమ వ్యాపారాన్ని స్మగ్లర్లు ప్రారంభించేశారు. విషయం తెలిసి.. సముద్రంలోకి వెళ్లిపోయిన వాటిని కూడా పట్టుకుని వెనక్కి తెస్తున్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జగన్ బినామీ అనే పేరు ఉంది. పవన్ ను ఓడించడానికి పిఠాపురంలో వంద కోట్ల వరకూ ఖర్చుపెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన సంపాదించిన లెక్కలన్నీ బయటకు తీసి.. కటకటాల వెనక్కి నెట్టాలని జనసేన పార్టీ నేతలు పట్టుదలగా ఉన్నారు. పవన్ కల్యాణ్ కూడా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.