నయనతార, ధనుష్ వివాదం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వీరి మధ్య చిచ్చుపెట్టింది. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది.
విఘ్నేశ్ శివన్‌తో నయన్ ప్రేమకథను ఇందులో చూపించారు. వీరిద్దరూ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’ వీడియోలు డాక్యుమెంటరీ కోసం ఉపయోగించుకోవాలని చూశారు. అందుకు చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదు. ట్రైలర్లో చూపించిన మూడు సెకన్ల క్లిప్‌నకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఈ క్రమంలోనే ధనుష్ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నయన్ – విఘ్నేశ్ పై దావా వేశారు. ఈ వివాదం ఈ నేపథ్యంలో నయన్ తాజాగా షేర్ చేసిన ఓ మెసేజ్ మరింత వేడిపుట్టించింది. ‘‘అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేస్తే దానిని మీరొక లోన్ గా భావించండి. ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి’’అని పోస్ట్ చేసింది నయన్.
ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవరిని ఉద్దేశించి పెట్టిందో చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి నయన్ ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలని చెబుతోంది. ధనుష్ మాత్రం కోర్టులో తేల్చుకోవాలనే ఉద్దేశంతో వున్నారు.