విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కొత్తగా ఆలోచిస్తున్నారు. సాధారణంగా పేరెంట్స్,టీచర్ మీటింగ్‌లు ప్రైవేటు స్కూళ్లలో జరుగుతూ ఉంటాయి. వారి వారి పిల్లలు ఎలా చదువుతున్నారు.. ఎలా కరెక్ట్ చేయాలి.. ఎలా ప్రోత్సహించాలి అన్న అంశంపై జరుగుతూ ఉంటాయి. నారా లోకేష్ మరింత విస్తృతంగా ఆలోచించి కొత్తగా పేరెంట్స్ , టీచర్ మీటింగ్స్‌ను ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడో తేదీన ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను స్కూళ్లలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కేవలం విద్యార్థుల చదువుల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు కాదు.. మొత్తం స్కూల్ మెరుగుదలకు చేస్తున్న ప్రయత్నం.ఈ సమావేశానికి స్థానిక ప్రజాప్రతినిధులంతా హాజరు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఏ స్థాయి ప్రజాప్రతినిది అయినా సరే రాజకీయ కండువాలు పక్కన పెట్టి పూర్తిగా స్కూల్‌ను బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి అన్న కోణంలోనే సమావేశాలకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాన్ని ఇలా అందరితో ఓ పండుగ వాతారవణంలో నిర్వహించి పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చునని లోకేష్ చెబుతున్నారు.
విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది ప్రభుత్వం లక్ష్యం అని లోకేష్ చెబుతున్నారు. పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వవిద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో భాగం కావాలని మనస్ఫూర్తిగా పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత పిల్లల చదువులతో పాటు స్కూళ్లు కూడా బాగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.