‘అ’ సినిమా వచ్చినప్పుడే ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ చాలా మందికి తెలిసింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద నిలబడలేకపోయినప్పటికీ ‘ఇతనెవరో కొత్తగా ఆలోచిస్తున్నాడు’ అనే ప్రశంస దక్కింది.
హనుమాన్ మాస్ విజయంతో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా పూర్తి లైమ్ లైట్ లోకి వచ్చారు. హనుమాన్ విజయం ఆయనకంటూ ఒక బ్రాండ్ ని తీసుకొచ్చింది. ఆ బ్రాండ్ ని మొదట వాడిన సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’. అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ ఇచ్చారు.
ప్రశాంత్ వర్మ కథ అనగానే ఒక ఆసక్తి ఏర్పడింది. తీరా సినిమా చూశాక షాక్ తగిలింది. ఒక్క ట్విస్ట్ తప్పితే సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు. పరమ రొటీన్ తీత. 15 ఏళ్ళ క్రితం వచ్చినా ఇలాంటి ట్రీట్మెంట్ వర్క్ అవుట్ కాదేమో.
సినిమా కథలు చాలా విచిత్రంగా తయారౌతుంటాయి. ఓ పాయింట్ చెబితే కూడా దాన్ని కథగా కన్సిడర్ చేసి క్రెడిట్ ఇస్తుంటారు. బహుసా ప్రశాంత్ వర్మ ఇలాంటి పాయింట్ ఎదో ఓరల్ గా చెప్పివుండాలి. అందులో ట్విస్ట్ నచ్చి దర్శకుడు తన స్టయిల్ లో ట్రీట్మెంట్ చేసుకొనివుండాలి. కాకపొతే సినిమా అవుట్ పుట్ చూశాక ప్రశాంత్ వర్మ ఒక జడ్జ్మెంట్ కి వచ్చేసివుండాలి. అయితే ఇక్కడే ప్రశాంత్ వర్మ జడ్జ్మెంట్ ఏమైయిందనే ప్రశ్న తలెత్తుతోంది.
నిజానికి కథ ఇచ్చిన రైటర్, అందులోనూ హనుమాన్ క్రేజ్ ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమా చూసిన తర్వాత కూడా చాలా ధైర్యంగా ఇంటర్వ్యూలకు, ప్రెస్ మీట్లకు వచ్చారు. దగ్గరుండి ప్రమోట్ చేశారు. నా కథకి న్యాయం జరిగిందని చెప్పారు. ప్రశాంత్ వర్మ మాటలు విని థియేటర్ లో కూర్చున్న జనాలు కూడా వున్నారు. అలాంటి ప్రశాంత్ వర్మ ఆడియన్స్ కూడా షాక్ అయ్యేలా ఈ సినిమా తయారైయింది.
బేసిక్ గా సినిమా రిజల్ట్ ఎలా వున్నా సక్సెస్ మీట్ పెట్టేయడం ఒక రివాజు. కానీ దేవకీ నందన ఎంతలా నిరాశ పరిచిందంటే టీం సక్సెస్ మీట్ జోలికి పోలేదు. మరి ఇంత డిజాస్టర్ ని ప్రశాంత్ వర్మ ముందు జడ్జ్ చేయలేదా? అంటే లేదనే చెప్పాలేమో.
ఏ సినిమా ఎప్పుడు ఎందుకు అందుతుందో ఎవరికీ తెలీదు. కథ ఇచ్చారు కాబట్టి తన ధర్మంగా ముందుండి ప్రమోషన్స్ చేయడం మంచిదే. కాకపొతే ఇకపై తన బ్రాండ్ తో సినిమా వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.