సీజ్ ద షిప్ అని పవన్ కల్యాణ్ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఏమీ తెలియని వాళ్లు ఈ పదం ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పాలని అమాయకంగా అడుగుతున్నారు. కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ కల్యాణ్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న షిప్ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆ షిప్ లో ఉన్న బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందినది కావడంతో అంతకు ముందు రోజు కలెక్టర్ వెళ్లి దాన్ని పట్టుకున్నారు.
పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చిన వైనం ఒక్క సారి సోషల్ మీడియాలో పాపులైపోయింది. ఆ షిప్ సీజ్ చేస్తే ఏమైనా ఒత్తిళ్లు వస్తే తాను కేంద్రం తో మాట్లాడతానని కూడా అధికారులకు పవన్ భరోసా ఇచ్చారు. కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ తనిఖీల వల్ల అక్కడ జరుగుతున్న వ్యవహారాలకు దేశవ్యాప్తంగా ఫోకస్ వచ్చింది. పోర్టుకు భద్రత లేని వైనంతో సహా విచ్చలవిడిగా సాగుతున్న స్మగ్లింగ్ ఇతర వ్యవహారాలపై దేశమంతా ఆశ్చర్యపోయేలా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పవన్ కల్యాణ్ హఠాత్తుగా కాకినాడ టూర్ పెట్టుకున్నారు. ముందుగా చెబితే చాలా మంది రావొద్దని ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. తాను వస్తున్నానని ఎస్పీకి కూడా సెలవు పెట్టి వెళ్లిపోయారని పవన్ చెప్పారు. నిజానికి పోర్టులో జరుగుతున్న వ్యవహారాల్లో అధికారుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పోర్టు అధికారుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పవన్ ఫోకస్ చేయగలిగారు.