ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడి సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి ఓ విద్యార్థిని చనిపోయింది. ఒక్క హాస్టల్ కాదు.. తెలంగాణలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు బయటపడ్డాయి. రాజకీయ దుమారం రేపాయి. ఏదో ఒక్క చోట అంటే అనుకోవచ్చు కానీ..ఇలా అన్ని చోట్లా ఒకే సారి.. ఎందుకు జరుగుతున్నాయో అధికారులకు అర్థం కాలేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సమయంలో పిల్లల అన్నంపై కుట్ర చేశారని అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ నేతగా మారిన మాజీ ఐపీఎల్ ప్రవీణ్ కుమార్ అత్యంత వివాదాస్పద నేతగా మారుతున్నారు. గతంలో ఆయన బెటాలియన్ పోలీసుల్ని రెచ్చగొట్టి వారి జీవితాలతో రాజకీయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సంక్షేమ హాస్టళ్లలో పిల్లల అన్నంపై కూడా ఆయన కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పటికీ గతంలో ఆయన సంక్షేమ శాఖలో హాస్టళ్లబాధ్యతను చూసేవారు. ఆయనకు స్వేరో పేరుతో ఓ నెట్ వర్క్ ఉంది.దాని ద్వారా ఇదంతా చేయిస్తున్నారని పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టే విషయంలో బీఆర్ఎస్ హయాం నాటికి ఇప్పటికి పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. కానీ ఒకే సారి అన్ని చోట్లా ఇలాంటి ఘటనలు బయటపడటం అంటే.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ప్లాన్ ప్రకారం చేశారన్న అభిప్రాయాలు కలగడానికి కారణం అవుతుంది. కాంగ్రెస్ నేతలు ఇదే ఆరోపిస్తున్నారు.