వైసీపీకి ఏదైనా సమస్య వస్తే ఎదురుదాడి చేయడానికి ఎవరూ కనిపించడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు రావడం లేదు. ఆయన వచ్చినా ఆయన మాట్లాడే విధానం సామాన్యులకు అర్థం కాలేదు. రాజకీయపరంగా ఎదురుదాడి చేయడానికి పేర్ని నాని వస్తారు. ఆయన మాట్లాడే విధానం చూస్తే ఎదుటివారికి ఎందుకు చూస్తున్నానా అన్న భావన కలుగుతుంది..?. ఆయన మాటలు చూసే వాళ్లను నిందిస్తున్నట్లుగా ఉంటాయి.
పేర్ని నాని ఎంత లాజిక్లతో ప్రెస్ మీట్లు పెట్టినా చివరికి అవి ఎదురుదాడి చేయడానికే తప్ప.. వాస్తవాలు ప్రజల ముందు ఉంచినట్లుగా ఉండవు.. ఇక మాట్లాడేందుకు ఎవరూ లేరన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సజ్జల ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లడం లేదా.. లేకపోతే ఎవరూ వచ్చి మాట్లాడటం లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. మండలి సమావేశాల తర్వాత బొత్స కూడా కనిపించడం మానేశారు. కీలక అంశాలపై పార్టీ వాదన వినిపించడం లేదు.
అయితే వైసీపీలో అన్ని విషయాలను మీడియాకు అర్థమయ్యేలా వివరించగలిగే నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన మాట్లాడితే కాస్త విలువ ఉంటుంది. వైసీపీకి ఆయన మాట్లాడే మాటల వెయిటేజీ పనికివస్తుంది. కానీ ఎందుకే.. బుగ్గనను మాత్రం జగన్ ఎంకరేజ్ చేయడం లేదు. ఆయన కూడా ఎప్పుడైనా ఆర్థిక శాఖ అంశాలపై ప్రెస్ మీట్ పెడితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పెడుతున్నారు. పార్టీ నేతల్ని యాక్టివ్ చేసుకునే విషయంలో జగన్ ఇప్పటికీ ఈగో సమస్యలకు పోతున్నారన్న భావన వైసీపీ వర్గాల్లో ఉంది.