పుష్ప 2 హంగామా మొదలైపోయింది. ఫ్యాన్సంతా ప్రీమియర్ షోల గురించి ఎదురు చూస్తున్నారు. డిసెంబరు 5న పుష్ప వస్తోంది. 4నే ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. 4వ తేదీ రాత్రి 9.30 ని.లకు పుష్ప తొలి షో పడే అవకాశం ఉంది. ఆ తరవాత అర్థరాత్రి 12.45కు మరో ఆట. ఇలా… 4వ తేదీ నుంచే పుష్ప రాజ్ రూల్ మొదలు కానుంది. తెలంగాణ ప్రభుత్వం 4వ తేదీ ప్రీమియర్లకు పచ్చ జెండా ఊపింది. ప్రీమియర్ షో టికెట్ రూ.800 వరకూ పెంచుకొనే వెసులు బాటు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. దీన్ని బట్టి సింగిల్ స్క్రీన్లో రూ.1121, మల్టీప్లెక్స్ లో1239 రూ. టికెట్ రేటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి నాలుగు రోజులూ సింగిల్ స్క్రీన్ టికెట్ రూ.354 ఉంటే, మల్టీప్లెక్స్ లో రూ.531 ఉండొచ్చు. తెలంగాణలో దాదాపు అన్ని థియేటర్లలోనూ ప్రీమియర్లు వేయాలన్నది మైత్రీ మూవీస్ ఆలోచన. అదే జరిగితే… పుష్ప 2 తొలిరోజు వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో టికెట్ రేట్లపై ఓ స్పష్టత రావాల్సివుంది. అక్కడ కూడా బెనిఫిట్ షోలకూ, ప్రీమియర్లకూ అనుమతులు ఈజీగానే దొరుకుతాయి. అయితే టికెట్ రేట్లు ఈస్థాయిలో పెంచుకొనే అవకాశం ఉందా, లేదా? అనేది చూడాలి. ఏపీ, తెలంగాణలో అదనపు ఆటలకైతే పర్మిషన్లు ఖాయం. రోజుకు 5 ఆటలతో వారం రోజులు, ఇదే రేట్లతో నడిపితే కచ్చితంగా పుష్ప 2 అన్ని రికార్డులనూ బ్రేక్ చేసే ఛాన్సుంది. ఇప్పటికే పుష్ప ఫీవర్ అంతటా పాకేసింది. ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. డిసెంబరు 1న హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ఉంది. ఏపీలో ఈవెంట్ జరుగుతుందా, లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరక్కపోతే, సక్సెస్ మీట్ మాత్రం అక్కడే భారీగా నిర్వహించే ఛాన్స్వుంది.