విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇందు కోసం అవసరం అయిన భవనాన్ని కూడా లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖలో డల్లాస్ టెక్నాలజీ సెంటర్ భవనాన్ని టీసీఎస్‌కు కేటాయించారు. ఇక్కడ ఒక్క షిఫ్టులో పధ్నాలుగు వందల మంది పని చేసే అవకాశం ఉంది. మొదట రెండు వేల మంది ఉద్యోగులతో క్యాంపస్ ప్రారంభిస్తామని టీసీఎస్ ప్రభుత్వానికి తెలిపిది. కార్యాలయ విస్తరణ కోసం స్థలాన్ని కూడా టీసీఎస్‌కు కేటాయించారు.
టీసీఎస్ సొంత క్యాంపస్ ఏర్పాటు చేయడానికి సమయం పడుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ముందుగానే కార్యకలాపాలు ప్రారంభించడానికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అందుబాటులోఉన్న భవనాన్ని కేటాయించింది. ఇతర ఇంటీరియర్ వర్క్ ను పూర్తి చేసుకుని త్వరలోనే క్యాంపస్ లైవ్ లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్లలోనే పది వేల మందికి సరిపడే సీటింగ్ తో క్యాంపస్ ను విస్తరించడమో లేకపోతే కొత్త క్యాంపస్ ను నిర్మించడమో చేసే అవకాశం ఉంది.
ఇన్ఫోసిస్ శాటిలైట్ సెంటర్ ఇప్పటికే విశాఖలో ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయి క్యాంపస్ ను ఏర్పాటు చేసే దిశగా లోకేష్ ఇన్ఫోసిస్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. మరో మూడు నెలల్లో దీనిపైనా సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు. మరో వైపు విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను తీసుకు వచ్చేందుకు టీసీఎస్ ఎంట్రీ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు